
ఇది అధికారిక సమాచారం. సర్వేలలో వెల్లడయింది కాదు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణ కాదు. స్వయంగా ముఖ్యమంత్రి జరిపిన సమావేశంలో ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు నివేదించిన వాస్తవం. 2014 ఎన్నికలపుడు, ఇతరసమయాలలో తెలుగుదేశం ప్రజలకిచ్చిన హామీలలో, గత రెండున్న రేళ్ల పరిపాలనలతో అమలయిన హామీలు కేవలం 30.56 శాతమే. స్కూలు పరీక్షలలో రావలసిన పాస్ మార్క్ ల కంటే కూడా ఇవి తక్కువ. ఇంత తక్కువ మార్కులతో మిగిలిన రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం డిస్టింక్షన్ ఎలా తెచ్చుకోగలదు ?
సర్వేలేమో పరిపాలన అద్భుతంగా పచ్చగా ఉందని పాగుతూ ఉందని చెబుతున్నాయి. 90 శాతం దాకా ప్రజలు తనతో ముఖ్యమంత్రి స్వయంగా ఉన్నారని చెబుతున్నారు. మరి అధికారికంగా పూర్తయిన హ మీలు కేవలం 31 శాతం మించలేదు. ఈ నేపథ్యంలో ఆయన అధికారులతో నిర్వ హించిన ఒక సమావేశంలో ఇలా ప్రాదేయపడ్డారు.
‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలుచేయాలని నేను తపిస్తున్నాను. ఇందుకు మీరు సహకరించాలి. నేను జిల్లాలలో పర్యటించే ముందే గతంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు కావాలి. మీకెంత సమయం కావాలో చెప్పండి. ఏవైనా సమస్యలు వస్తే నాకు చెప్పండి.’
సోమవారం సాయంత్రం సీఎంఓలో ‘ముఖ్యమంత్రి హామీల అమలు’ను 12 విభాగాల అధికారులతో చంద్రబాబు నాయుడు సమీక్షించారు. మొత్తం 926 హామీలకు గాను 283 హామీలను పూర్తిస్థాయిలో పరిష్కరించగా, 628 దాదాపు పరిష్కారదిశలో ఉన్నాయని అధికారులు వివరించారు. మరో 15 హామీల అమలుకు చొరవతీసుకోవాల్సి ఉందని చెప్పారు. 30.56 శాతం పరిష్కారమయ్యాయని అధికారులు చెప్పారు. ఈ వివరాలను ప్రభుత్వాధికారులు మీడియా కు విడుదల చేశారు.
‘నిధులు లేవనే సమస్యే లేదు. ఎక్కడ నిధులు అవసరమైతే అక్కడ కన్వర్జెన్స్ తో ముందుకు వెళుతున్నాం. నాబార్డ్ లాంటి వ్యవస్థలతో ఇబ్బందులు వస్తే నా దృష్టికి తెండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో అన్నారు.
‘ముఖ్యమంత్రి మంజూరు చేశారు కానీ డబ్బులు రాలేదు’ అనే మాటలు ఎక్కడైనా విన్పిస్తే ప్రశంసించారో, విమర్శించారో తెలియదు’ అని చంద్రబాబు అన్నారు. సీఎంఓలో అధికారులతో మాట్లాడి హామీలన్నింటినీ సత్వరం అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాధాన్యక్రమంలో ప్రాజెక్టుల పూర్తి విషయంలో నిధులపై సమస్యలు వస్తే చర్చించాలని కోరారు. ఎక్కడైతే సమస్యలు వస్తాయో అక్కడ సమన్వయపర్చుకోవాలి, పైస్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.
శ్రీకాకుళంలో 55 కు 17, విజయనగరంలో 31 కి 13, విశాఖలో 129 హామీలకు 12 హామీలను, తూర్పుగోదావరి లో 57కు 27, పశ్చిమ గోదావరిలో 194 హామీలకు 60, కృష్ణా లో 22 హామీలకు 6, గుంటూరు జిల్లాలలో 44 హామీలకు 11, ప్రకాశంలో 55కు 12, నెల్లూరులో 26కు 3, చిత్తూరులో 99కి 53, కడపలో 51కి 8, అనంతపురంలో 86కు 32, చిత్తూరులో 99కి 53 హామీలు పూర్తిస్థాయిలో అమలుజరిగాయి. రెవెన్యూ విభాగంలో ఇచ్చిన హామీల్లో 55-26, పౌర సరఫరాల శాఖలో 10కి 10 పరిష్కారమయ్యాయి.
విద్యారంగంలో 34కు 17, గృహ నిర్మాణంలో 15-7, వైద్య ఆరోగ్యం 38కి 7,మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 87కు 7, గ్రామీణాభివృద్ధిలో 52కు 14, పంచాయతీరాజ్ లో 163 కు 65 హామీలు పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యాయి. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఒక్క హామీకి ఒక్కటీ అమలుజరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ లో 7కు 3, సాంఘిక సంక్షేమశాఖలో 4కు 3 హామీలు పరిష్కారమయ్యాయి. మిగతావన్నీ పరిష్కార దశలో ఉన్నాయని, కేవలం 15 హామీల అమలుపైనే ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని అధికారులు వివరించారు.
సమావేశంలో మంత్రి గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీమతి కిమిడి మృణాళిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యప్రకాశ్ టక్కర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి శ్రీ ఎ. వి రాజమౌళి, ఐటి కార్యదర్శి ప్రద్యుమ్న, పన్నెండు విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు.