క్రిస్తియన్లకు బానే గాలం వేస్తున్నారు

First Published Dec 26, 2016, 8:04 AM IST
Highlights

చంద్రబాబు క్రిస్తియన్లను ఆకర్షించేందుకు పెద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు.  

చంద్రబాబు క్రిస్తియన్లను ఆకర్షించేందుకు పెద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు.  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్తియన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి క్రిస్తియన్లను ఆకట్టుకునేందుకు సిఎం కూడా క్రిస్మస్ దినోత్సవాన్ని ఉపయోగించుకోవటం గమనార్హం. పెదకాకానిలోని చర్చ్ కు హాజరవ్వటమే కాకుండా బైబిల్ లోని 23వ కీర్తనను స్వయంగా చదివి వినిపించారు.

 

గతంలో చంద్రబాబు సిఎంగా పనిచేసినపుడు గానీ ప్రతిపక్షంలో ఉన్నపుడు గానీ బైబిల్ ఎప్పుడూ చదవలేదు. కీర్తన చదివిన తర్వాత మాట్లాడుతూ, క్రిస్మస్ పర్వదినాన ఏసు కీర్తన చదివే అదృష్టం లభించటం నిజంగా తన పూర్వజన్మ సుకృతమన్నారు. కీర్తన చదవటాన్ని నిజంగానే సుకృతంగా భావించినపుడు రోజు ఇంటి దగ్గర కీర్తనలను చదువుకుంటే ఎవరైనా కాదంటారు?

 

మొక్కుబడి మాటలకు చంద్రబాబు బాగా అలవాటు పడిపోయారు. చర్చ్ కు వచ్చినపుడు ఒకలాగ, దర్గాకు వెళ్లినపుడు, దేవాలయం వద్ద... సమయం ఏదైనా, సందర్భం ఏదైనా సరే ఏవో నాలుగు ఊకదంపుడు మాటలు మాట్లాడటం వెళ్లిపోవటం చంద్రబాబుకు బాగా అలవాటైపోయింది.

 

తాజాగా గుంటూరు జిల్లాలోని పెదకాకానిలోని స్వస్తిశాలలో జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొని అటువంటి మాటలే చెప్పారు.

 

పేదవాళ్ళు ఆనందంగా జీవించాలని ఏసుప్రభువు కోరుకున్నారని చెప్పారు.  అంత వరకూ బాగానే ఉంది. అయితే, ఏసుప్రభువు దీవెనలతో తాను కూడా పేదల ముఖంలో సంతోషం చూడటమే ధ్యేయంగా పాలన చేస్తానని చెప్పటమే కాస్త అతిశయోక్తి అనిపించింది.

 

పండగపూట పేదలు ఇబ్బందులు పడకూడదనే చంద్రన్న క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసినట్లు చెప్పారు. పంపిణీ చేసిన నిత్యావసరాల్లో నాసిరకం వస్తువులున్నట్లు సాక్షాత్తు మంత్రి పరిటాల సునీతే అసంతృప్తి వ్యక్తం చేసారు. పేరు చంద్రన్న కానుక..పంపిణీ మొత్తం నాసిరకమే.

 

సమాజంలో పేదరికమ్మనది లేకుండా చేయటమే తన ధ్యేయమన్నారు. నిజంగా ఇది సాద్యమేనా. సమాజంలో ఆర్ధిక అసమానతలును తొలగిస్తానన్నారు. ఎలా సాధ్యమో నిప్పు చంద్రబాబే చెప్పాలి.

 

పెదకాకాని స్వస్తిశాలకు ప్రతీ సోమవారం, రెండో శనివారం వేల సంఖ్యలో క్రైస్తవులు వస్తున్నందున ఆయా రోజుల్లో గోదావరి జిల్లాల నుండే కాకుండా ఇటు మాచర్ల వైపు నుండి కూడా ప్రత్యేక రైళ్ళను వేసేందుకు రైల్వే శాఖతో చర్చిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఇదెంత వరకూ ఆచరణలోకి వస్తుందో చూడాలి.

 

click me!