అమలవుతున్న స్పెషల్ ప్యాకేజీలు

First Published Feb 16, 2017, 1:03 AM IST
Highlights

కేంద్రం చెప్పిన ప్రత్యేకప్యాకేజీ అమలు కాకపోయినా ‘చంద్రబాబు ప్రత్యేకప్యాకేజి’లు అమలవుతున్నట్లే కదా? ఎవరికైనా డౌటా?

ఎవరన్నారు రాష్ట్రంలో స్పెషల్ ప్యాకేజీ అమలు కావటం లేదని. రాష్ట్రంలో కేంద్రం అమలు చేయాల్సిన స్పెషల్ ప్యాకేజి అమలు కాకపోవచ్చుగానీ కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు సొంతంగానే ప్యాకేజీలను అమలు చేస్తున్నారు. ఈ ప్యాకేజీలు ‘చంద్రబాబు మార్కు స్పెషల్ ప్యాకేజీ’లు. ఫిరాయింపు శాసనసభ్యుల కోసమే ఉద్దేశించినవి. ఇప్పటి వరకూ వైసీపీ నుండి 21 మంది ఎంఎల్ఏలు, కాంగ్రెస్ నుండి తాజాగా ఓ ఎంఎల్సీ టిడిపిలోకి ఫిరాయించారు. కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఓ స్పెషల్ ప్యాకేజి అమలకు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

ఫిరాయింపు సమయంలోనే తమ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చంద్రబాబుతో వైసీపీ ఎంఎల్ఏలు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. సదరు కార్యక్రమాలు తమ ద్వారానే అమలయ్యేట్లు హామీలు కూడా పొందిన తర్వాతే వారు ఫిరాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకనే కదా ఫిరాయింపు ఎంఎల్ఏలకు, టిడిపి నేతలకు మధ్య పచ్చ గడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది.  

 

కడప జిల్లానే తీసుకుంటే, బద్వేలు నియోజకవర్గం ఎంఎల్ఏ జయరాములు వైసీపీ నుండి ఫిరాయించారు. ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం ఆయన ద్వారానే జరుగుతున్నాయి. ఈ విషయం మీదనే ఎంఎల్ఏకి స్ధానిక టిడిపి నేతలకు గొడవలవుతున్నాయి. ఇక, కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల గొడవలు కూడా ఇటువంటివే. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో టిడిపి నేత కరణం బలరాంకు ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికి మధ్య ప్యాకేజీ గొడవలే. అనంతపురం జిల్లాలో టిడిపి నేతలకు ఎంఎల్ఏ చాంద్ భాషాకు పొసగకపోవటానికి కూడా ప్యాకాజీలే కారణం.

 

ఇలా చెప్పుకుంటూపోతే దాదాపు అన్నీ ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో ఇటువంటి స్పెషల్ ప్యాకేజీలనే చంద్రబాబు అమలు చేస్తున్నారు. అందుకనే ఆయా నియోజకవర్గాల్లో గొడవలు తీవ్రంగా ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ నుండి ఫిరాయించిన ఎంఎల్సీ చెంగల్రాయడు విషయంలో కూడా చంద్రబాబు స్పెషల్ ప్యాకేజి అమలుకు హామీ ఇచ్చారని ప్రచారంలో ఉంది. ఎంఎల్సీతో పాటు కొందరు స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు కూడా టిడిపి తీర్ధం పుచ్చుకుంటున్నారు. అటువంటి వారి మండలాలు, లేదా గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను వారి నేతృత్వంలోనే అమలు జరిగేట్లు చంద్రబాబు తగిన హామీ ఇచ్చినట్లు సమాచారం. అంటే అర్ధం ఏమిటి? కేంద్రం చెప్పిన ప్రత్యేకప్యాకేజీ అమలు కాకపోయినా ‘చంద్రబాబు ప్రత్యేకప్యాకేజి’లు అమలవుతున్నట్లే కదా? ఎవరికైనా డౌటా?

click me!