వచ్చే ఎన్నికల్లో సిఎం పదవి తీసుకోరా ?

First Published Jan 29, 2017, 3:22 AM IST
Highlights

ప్రధానమంత్రి పదవి కూడా ఉంటుంది కానీ అంతర్జాతీయస్ధాయి అయితే కాదు. చంద్రబాబు పేరే ఓ బ్రాండ్ ఇమేజ్ అన్నపుడు ఇక చంద్రన్నకు వేరే పదవులు అవసరం లేదేమో.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సిఎం పదవి అన్నది చాలా చిన్నదే. బహుశా వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిని కొడుకు లోకేష్ కు అప్పగించేస్తారేమో. ఎందుకంటే, ముఖ్యమంత్రిగా ఉంటే కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితమవ్వాలి. అది చంద్రబాబు స్ధాయికి చాలా చిన్నది. ప్రధానమంత్రి పదవి కూడా ఉంటుంది కానీ అంతర్జాతీయస్ధాయి అయితే కాదు. చంద్రబాబు పేరే ఓ బ్రాండ్ ఇమేజ్ అన్నపుడు ఇక చంద్రన్నకు వేరే పదవులు అవసరం లేదేమో.

 

దావోస్ నే రాష్ట్రానికి తీసుకు రాగలిగిన వ్యక్తికి వేరే పదవులతో పనేలేదు. ఏంటి వనటానికి కాస్త ఇబ్బందిగా ఉందా? స్వయంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిందే ఆ మాట. ఇకపై అక్కడికి ఎవరూ వెళ్ళరని చంద్రన్న స్పష్టం చేసారు. ఒకవేళ వెళితే అంతే సంగతులు. ప్రపంచం మొత్తాన్ని అనుసంధానం చేస్తానని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచంలో తన బ్రాండ్ ఇమేజ్ పెరిగిపోయిందని చంద్రన్నే చెప్పుకున్నారు. బ్రాండ్ ఇమేజ్ ఎవరికి ఉంటుంది? మనుషులకైతే ఉండదు. ఉత్పత్తులకో లేక కంపెనీలకో ఉంటుంది.

 

రెండు రోజుల పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు ముగింపు రోజున మీడియాతో మాట్లాడుతూ, ఒప్పందాలన్నీ కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలో 22,34,096 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పటం గమనార్హం. ఒప్పందాలన్నీ కార్యరూపందాలిస్తే...అని చెప్పటమేమిటి? అంటే అనుమానమేనా. పోయిన సదస్సు తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై ప్రశ్నించటాన్ని చంద్రబాబు ఏమాత్రం సహించలేకున్నారు. ఎందుకంటే, పోయిన సదస్సు తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు సాక్షాత్తు గవర్నర్ ప్రసంగం ప్రకారం రూ. 5 వేల కోట్లే. మరి దాన్నే చంద్రబాబు తప్పంటున్నారు. గవర్నర్ ప్రసంగంలో అచ్చుతప్పు పడిండట. గవర్నర్ ప్రసంగాన్ని తయారుచేసేది మళ్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులే.

 

పోయిన సదస్సులో జరిగిన ఎంఓయులను మళ్ళీ ఇపుడు కొత్తగా చేసుకున్నారని సమాచారం. అదే విషయాన్ని అడిగినపుడు చంద్రన్న అంతెత్తున ఎగిరిపడ్డారు. టెలికాం సంస్కరణల నుండి పెద్ద నోట్ల రద్దు వరకూ దేశంలోని అన్నీ సంస్కరణలకూ తానే ఆధ్యుడనని చెప్పుకున్నారు. టెలికం సంస్కరణలకు ఆధ్యునిగా ఇప్పటి వరకూ అందరూ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధి అని అనుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దుకు తనకు ఏమీ సంబంధం లేదని స్వయంగా చంద్రన్నే ఎన్నో మార్లు చెప్పారు. పైగా ప్రధాని వద్దనుండి రాష్ట్రపతి వరకూ తాను ఎంపిక చేసినవారేనని చెప్పుకోవటం గమనార్హం. ఈ మాటలు గనుక మోడి చెవిన పడితే ఇంకేమన్నా ఉందా?

 

 

 

 

 

 

click me!