ఒత్తిడికి దిగొచ్చిన చంద్రబాబు

First Published Dec 12, 2017, 4:55 PM IST
Highlights
  • మొత్తానికి చంద్రబాబునాయుడు దిగొచ్చారు.

మొత్తానికి చంద్రబాబునాయుడు దిగొచ్చారు. పోలవరం నిర్మాణంపై కొద్ది రోజులుగా జరుగుతున్న రాద్దాంతం అందరికీ తెలిసిందే. పనులు జరుగుతున్న తీరు, ఖర్చవుతున్న నిధులు, కేంద్రం ఇస్తున్న నిధులు, రాష్ట్రం చేస్తున్న ఖర్చు..ఇలా అన్ని విషయాలపైనా నానా రాద్దాంతం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోలవరం ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సరే అదే డిమాండ్ ను వైసిపి ఎప్పటి నుండో చేస్తున్నది లేండి.

ఏవరెంత డిమాండ్ చేసినా పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసేది లేదని చంద్రబాబు భీష్మించుకుని కూర్చున్నారు. ఎవరెన్ని సార్లు డిమాండ్ చేసినా ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. వైసిపి గైర్హాజరైన అసెంబ్లీ సమావేశాల్లో  మొత్తం ప్రాజెక్టు లెక్కలు చెప్పామన్నారు. పారదర్శకంగా ఉంటున్నందు వల్ల ప్రత్యేకించి శ్వేతపత్రం అవసరమే లేదని చంద్రబాబు తేల్చేశారు. ఉండవల్లి లాంటి వాళ్ళు కేంద్రానికి చంద్రబాబు తప్పుడు నివేదికలు పంపుతున్నట్లు మండిపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

అటువంటిది ఏమైందో ఏమో హటాత్తుగా పోలవరం లెక్కలన్నింటనీ ఆన్ లైన్లో ఉంచాలని ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు చెందిన అన్నీ వివరాలను ఆన్ లైన్లో ఉంచాలని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రం చేసిన ఖర్చులు, పునరావాస ప్యాకేజికి పెట్టిన ఖర్చు, ప్రాజెక్టు పురోగతితో సహా అన్నీ వివరాలను ఆన్ లైన్లో ఉంచాలన్నారు. మరి, ఆన్ లైన్లో పెట్టబోయే లెక్కలపై ఇంకెత రాద్దాంతం అవుతుందో చూడాలి.

click me!