
చంద్రబాబు వితండవాదం మొదలుపెట్టారు. ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలకు ప్రోత్సహకాలు వస్తాయన్న జీవో ఎక్కడ ఉందో చూపాలని ప్రతిపక్షాలను అడగటం హాస్యాస్పదమే. రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ ను అర్ధంలేనిదిగా ఇపుడు చంద్రబాబు కొట్టేస్తున్నారు. మరి ఎన్నికల్లో మోడి, చంద్రబాబు హోదాపై ఎందుకు హామీలిచ్చినట్లు? అదే విధంగా, ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందంటూ రెండుసార్లు అసెంబ్లీలో ఎందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారో సిఎమ్మే సమాధానం చెప్పాలి.
అసలు ప్రత్యేకహోదా వల్ల ఎటువంటి ఉపయోగాలు లేనపుడు చంద్రబాబు సన్నిహితులు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్ఘడ్ తదితర రాష్ట్రాలకు వెళ్లి మరీ ఎందుకు పరిశ్రమలు పెట్టిన్నట్లు? రాయితీలు పొందేందుకేనా లేక ఆ రాష్ట్రాలను ఉద్ధరించేందుకా? ఇక, భాగస్వామ్య సదస్సు జరిగే ముందురోజు విశాఖపట్నంలో కావాలనే అల్లర్లు జరగాలని ప్లాన్ చేసారని ఆరోపిస్తున్నారు. అల్లర్లు జరిగి ఉంటే రాష్ట్రానికి రూ. 10.5 లక్షల కొట్ల పెట్టుబడులు వచ్చేవా అన్న ప్రశ్నే అర్ధం లేనిది.
ఎందుకంటే, భాగస్వామ్య సదస్సులో జరిగింది కేవలం ఒప్పందాలు మాత్రమే. అందులో పదిశాతం పెట్టుబడులు వచ్చేది కూడా అనుమానమే. పోయిన సారి జరిగిన పెట్టుబడుల ఒప్పందాల్లో వచ్చిందెంతో అందరకీ తెలిసిందే. అదేవిధంగా మొన్నటి సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న వారి భాగోతాలు బయటపడుతున్నకొద్దీ రాష్ట్రం పరువే పోతోంది. అందుకు సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు రాష్ట్రానికి రూ. 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు దబాయించటం ఆశ్చర్యం. ఇక, ఆందోళనలు జరిగితే రాష్ట్రం పరువుపోతుందని చెప్పటంలోనూ అర్ధం లేదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు ఎన్నిసార్లు ఆందోళనలు చేయలేదు? అధికారంలోకి వచ్చిన తర్వాతే చంద్రబాబుకు రాష్ట్రం పరువు గుర్తుకువచ్చిందా? ప్రత్యేకరాష్ట్రం డిమాండ్ తో తెలంగాణాలోనూ ఆందోళనలు జరిగాయి. కొన్ని వందల మంది ప్రాణాలూ కోల్పోయారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడులు రావటం ఆగిపోయాయా?
ఇక, రాష్ట్రంలో కొందరు కులమత విధ్వేషాలను రెచ్చగొడుతున్నట్లు ఆరోపిస్తున్నారు చంద్రబాబు. గడచిన రెండున్నర ఏళ్ళలో రాష్ట్రంలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదు. కుల వివాదాలంటారా అది చంద్రబాబు పుణ్యమే. కాపులను బీసీల్లో చేరుస్తాననే అలవికాని హామీనిచ్చిన తర్వాత మరచిపోయారు. దాంతో ఇపుడు కాపులు ఆందోళనలు మొదలుపెట్టారు. మొత్తానికి ముఖ్యమంత్రి ప్రత్యేకహోదా సాధింలేక, ప్యాకేజికి చట్టబద్దత రాబట్టలేక ప్రతిదానికిీ ప్రతిపక్షాలను తప్పపుడుతుండటం గురువింద గింజ నీతిని గుర్తు చేస్తోంది.