
ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న బలమైన నేత హటాత్తుగా మరణిస్తే రాష్ట్రంలో ఎటువంటి గందరగోళం రేగుతుందో తమిళనాడు రాజకీయాలే నిదర్శనం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి సర్వం సిద్ధం చేసుకున్న చిన్నమ్మను కొద్ది రోజులు ఆగాల్సిందిగా సోమవారం గవర్నర్ సూచించటంతో రాష్ట్రంలో గందరగోళం మొదలైంది. డిసెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు రోజుకోమలుపు తిరుగుతున్నాయి. బయటనుండి చూసేవారికి సినిమా సస్పెన్స్ కు మించిన ఉత్కంఠ ఉండవచ్చుగానీ ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే తమిళనాడు పరిస్ధితి ‘సముద్రంలో చుక్కాని లేని నావలా’గ తయారైంది.
ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలో అయోమయం. మంత్రివర్గానికి చిన్నమ్మకు పదవి విషయాన్ని తప్ప ఇంకేమీ పట్టించుకోవటం లేదు. పొయెస్ గార్డెన్లో ఉండి చిన్నమ్మ శశికళ చక్రం తిప్పుతోంది. ఎవరి ఆదేశాలను పాటించాలోఉన్నతాధికారులకు దిక్కుతెలీటం లేదు. ఈ పరిస్ధితుల్లోనే పన్నీర్ సెల్వం స్ధానంలో మొన్నటి ఆదివారం శశికళ శాసనసభాపక్ష నేతగా ఎంపికయ్యారు. దాంతో ముఖ్యమంత్రిగా పన్నీర్ రాజీనామా చేసారు. 9వ తేదీన సిఎంగ బాధ్యతలు తీసుకోవటమే ఆలస్యమని అనుకుంటున్న సమయంలో గవర్నర్ అడ్డుపడ్డారు.
మరో వారంలొ జయలలిత అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువడుతోంది. అందుకని సిఎం ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా గవర్నర్ విద్యాసాగర్ రావు చేసిన సూచనతో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఇప్పటికే జయతో పాటు శశికళకు కూడా జైలు శిక్ష పడింది. దానికితోడు శశికళతో పాటు ఆమె కుటుంబంపై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అక్రమ ఆస్తుల కేసులో జయతో పాటు శశికళ కూడా జైలుకు వెళ్లారు. బైలుపై బయటున్నారు.
సిఎంగా బాధ్యతలు తీసుకున్న వారానికే న్యాయస్ధానం శిక్షను ఖరారు చేస్తే బాగుండదని శశికళకు గవర్నర్ సూచించారట. అక్రమాస్తులపై వారం రోజుల్లో తుది తీర్పు వెలువరించనున్నట్లు సుప్రింకోర్టు చెప్పిన నేపధ్యంలో అప్పటి వరకూ మళ్ళీ పన్నీరే రాష్ట్రానికి ఆపధర్మ ముఖ్యమంత్రి. అందుకే తమిళనాడుకు సంబంధించిన ఓ జోక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విద్యార్ధుల క్వార్టర్లీ పరీక్షలకు ముఖ్యమంత్రి జయలలిత. హాఫ్ ఇయర్లీ పరీక్షలకు సిఎం పన్నీర్ సెల్వం. వార్షిక పరీక్షలకు ముఖ్యమంత్రి శశికళ. అయితే, హటాత్ పరిణామంతో విద్యార్ధులకు సిఎంగా ఎవరి పేరు రాయాలో అర్ధం కావటం లేదట.