
విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ కార్యకలాపాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో సభలు, సమావేశాలు, రహస్య భేటీలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే జనసేన నేత, పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఓ రహస్య సమావేశాన్ని నిర్వహించినట్లుగా సమాచారం. కాపు నేతలు, వ్యాపార ప్రముఖులతో రహస్యంగా సమావేశం నిర్వహించారట.
ఈ సమావేశాన్ని విశాఖలోని బీచ్ రోడ్డులో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించినట్లు, దీంట్లో కీలకమైన అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి హాజరైన వారికి సెల్ ఫోన్లు కూడా లోనికి తీసుకురావడానికి అనుమతి ఇవ్వలేదట. పూర్తి భద్రతాపరమైన జాగ్రత్తలతో సమావేశం నిర్వహించారట నిర్వాహకులు. వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి గెలిపే ప్రధానంగా పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్..!?
ఈ సమయంలో కాపు నేతలు అనేక సందేహాలను నాగబాబు ముందు ఉంచారట. అందులో ముఖ్యమైనది ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఉన్నాయట. దీనిపై నాగబాబు స్పందిస్తూ పదవుల విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ అవుతుందని.. మిగిలిన నాయకుల మాటలను పరిగణలోకి తీసుకోవద్దని స్పష్టం చేశారట. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు సామాజిక వర్గాలకే అవకాశం లభించిందని ఇప్పుడు మార్పు తీసుకురావాల్సిందేనని తీర్మానం చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానికంటే వచ్చే ఎన్నికల్లో జనసేన-టిడిపి విజయం లక్ష్యంగా పనిచేయాలని కాపు నేతలను, వ్యాపార ప్రముఖులను నాగబాబు కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి కార్యాచరణతో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు చేసిన ఈ రహస్య భేటీ చర్చనీయాంశంగా మారింది.