
సినీ నటులు నాగబాబు, హైపర్ ఆదిలు ఆస్ట్రేలియా పర్యటనకు బయలేరి వెళ్లారు. అయితే వీరు ఆస్ట్రేలియకు వెళ్తున్నది సినిమాలకు సంబంధించి కాదు. జనసేన పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న నాగబాబు, హైపర్ ఆదిలు.. ఆస్ట్రేలియాలో నిర్వహించననున్న ఆ పార్టీ ఆవిర్బావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలో ప్రధాన నగరాల్లో ప్రవాస జనసైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్బావ వేడుకల్లో పాల్గొన్ని ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.
‘‘ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రవాస జనసైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు బుధవారం హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా బయలుదేరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్, బ్రిస్బేన్ తదితర ముఖ్య నగరాల్లో వారం రోజుల పాటు జరగనున్న ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో నాగబాబు గారు పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్య కార్యకర్తలతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొంటారు. జనసేన పార్టీ నాయకులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, హైపర్ ఆదిలు నాగబాబుతో కలిసి ఆస్ట్రేలియాలో జరుగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొంటారు’’ అని జనసేన పార్టీ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 10 నుంచి 16 వరకు ప్రధాన నగరాల్లో జనసేన కార్యకర్తలు, అభిమానులతో ఇంటరాక్ట్ కావడం జరుగుతుందని నాగబాబు తెలిపారు. వారి ఆహ్వానం మేరకు వెళ్లడం జరుగుతుందని చెప్పారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడైన నాగబాబు.. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. మరోవైపు పవన్‌ను అభిమానించే.. హైపర్ ఆది కూడా ఇటీవలి కాలంలో జనసేనలో యాక్టివ్‌గా మారారు. ఈ ఏడాది జనవరిలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ నిర్వహించిన యువశక్తి సభలో హైపర్ ఆది పవర్ ఫుల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో జనసేన తరఫున హైపర్ ఆది పోటీ చేయనున్నారనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది.
ఇక, జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 14న మచిలీపట్నంలో జరుపుకోనుంది. ఈ వేడుకల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. తొలుత భారీ ర్యాలీ.. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు దాదాపు నాలుగు లక్షల మంది జనసేన కార్యకర్తలు, మద్దతుదారులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సభా వేదికగా పవన్ కల్యాణ్ జనసేన శ్రేణులకు వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక మార్గనిర్దేశనం చేసే అవకాశం ఉంది.