
అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (international womens day) రోజే ఆంధ్ర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. అధికార వైసిపి పార్టీ (ysrcp)కి చెందిన నాయకుడొకరు పొలంపనులకు వెళ్లిన మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే పోలీసులు అధికార పార్టీ నేతపై కేసు నమోదు చేయడానికి వెనకాడుతుండటంతో బాధిత మహిళకు మద్దతుగా గ్రామస్తులంగా పోలీస్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా (guntur district) వినుకొండ రూరల్ పరిధిలోని ఈపూరుకు చెందిన ఓ మహిళ నిన్న(మంగళవారం) ఉదయం ఒంటరిగా పొలానికి వెళ్లడాన్ని వైసిపి నేత గమనించాడు. ఎప్పటినుండో ఆమెపై కన్నేసిన అతడు ఇదే అదునుగా ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతడి నుండి తప్పించుకున్న మహిళ గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్న వారు గుమిగూడటంతో అప్పటికే వైసిపి నేత పరారయ్యాడు.
Video
బాధిత మహిళ కుటుంబసభ్యుల సాయంతో తనపై జరిగిన అత్యాచారయత్నంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు సదరు వైసిపి నేతపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈపూరు గ్రామస్తులు ఆగ్రహించారు. గ్రామస్తులంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళను దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఇదే మహిళా దినోత్సవం రోజున ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. విదేశీ పర్యాటకురాలిపై కొందరు ఇద్దరు యువకులు అత్యాచారయత్నానికి ఒడిగట్టి చివరకు కటకటాలపాలయ్యారు. ఏపీలో జరిగిన ఈ సంఘటన అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ప్రతిష్టనే దిగజార్చేలా వుండటంతో పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని కేవలం గంటల వ్యవధిలోనే విదేశీ మహిళపై అత్యాచాయత్నానికి పాల్పడిన దుండగులను గుర్తించి అరెస్ట్ చేసారు.
ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లిథువేనియా దేశానికి చెందిన కరోలినా మహిళా దినోత్సవం రోజున అంటే నిన్న మంగళవారం బస్సులో ప్రయాణిస్తుండగా నిందితుడు సాయికుమార్(28) పరిచయమయ్యాడు. సహయం చేసినట్లే చేసి ఆమెను మాయమాటలతో నమ్మించి నెల్లూరు జిల్లాకు తీసుకువెళ్లాడు. మరో స్నేహితుడ షేక్ అబిద్(26) తో కలిసి కరోలినాను సైదాపురం అడవుల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వారి చెరనుండి తప్పించుకున్న విదేశీయురాలు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే నిందితులిద్దరినీ అరెస్ట్ చేసారు.
దేశ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన గూడూరు పోలీసులను నెల్లూరు ఎస్పీ అభినందించారు. విదేశీ మహిళపై అత్యాచాయత్నానికి పాల్పడిన ఇద్దరు యువకులపై Cr.No.16/2022 u/s 354-A, 376 r/w 511, 120 (b) IPC కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ జిల్లా పోలీసు యంత్రాంగం ముందుంటుందని ఎస్పీ తెలిపారు.