హోదాల్లో మార్పులు, కమిషనర్ల బదిలీలు... ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Apr 16, 2021, 10:40 AM IST
Highlights

రాష్ట్రంలో కీలక పదవుల్లో కొనసాగుతున్న పలువురు అధికారుల హోదాలను మార్చడంతో పాటు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ చేపడుతూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పలువురు అధికారుల హోదాల్లో మార్పులు చేపట్టింది. ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె.వి.వి సత్యనారాయణ హోదాను ఆర్థికశాఖ కార్యదర్శిగా, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన్ రెడ్డి హోదా ముఖ్య కార్యదర్శిగా మార్చింది.  ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇదిలావుంటే రాష్ట్రంలోని పలువురు మున్సిపల్‌ కమిషనర్లు కూడా బదిలీ అయ్యారు. అనంతపురం అడిషనల్‌ కమిషనర్‌గా శ్రీహరిబాబు, కదిరి మున్సిపల్‌ కమిషనర్‌గా కె. ప్రమీల, చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సెక్రటరీగా కె.చిన్నోడు, ఎర్రగుంట్ల మున్సిపల్ కమిషనర్‌గా పి.జగన్నాథ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. 

ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. సెర్ప్ సీఈఓ పనిచేస్తున్న రాజబాబును తప్పించి ఆ స్థానంలో కృష్ణా జిల్లా జేసీ మాధవీలత నియమించారు. అయితే రాజబాబుకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా జీఎడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.  ఇక కృష్ణా జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా శివశంకర్ లోహేటి కీ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. 

పంచాయితీ ఎన్నికల సమయంలో కూడా జగన్ సర్కార్ పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలను చేపట్టింది. బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంత రామును, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు స్పెషల్ సిఎస్(జీపీఎం అండ్ ఏఆర్)గా ప్రవీణ్ కుమార్, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శిగా జయలక్ష్మీ నియమించారు. అలాగే జయలక్ష్మికి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. 
 


 

click me!