
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు (YS Jagan) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) లేఖ రాశారు. సంక్రాంతి (sankranthi) పండుగ వస్తున్న నేపథ్యంలో ఐదు రోజుల పాటు కోడిపందాల (Cock Fight) పర్మిషన్‌కు పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ముద్రగడ ఈ లేఖ ద్వారా సీఎం జగన్‌ను కోరారు. కోడి పందాలు వంటివి జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు కావని అన్నారు. ఇది చాలా సున్నితమైన విషయమని పేర్కొన్నారు. గ్రామాలలో సంక్రాంతి, ఉగాది ఉత్సవాలను ఘనంగా చేయడం ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆచారమని తెలిపారు. సంక్రాంతి వేడుకల్లో (sankranthi celebrations) ఎడ్ల పందాలు, కోడిపందాలు, ఆటల పోటీలు, గోలీలు ఆడుకోవడం.. ఇలా 5 రోజులు వేడుకలు జరుపుకుంటారని చెప్పారు.
ఇందుకు సంబంధించి పోలీసులు, అధికారులు, చివకు ముఖ్యమంత్రి నుంచి కూడా అనుమతి అడిగేవాడినని ముద్రగడ తెలిపారు. అందుకు వారు కూడా అంగీకారం తెలిపేవారని అన్నారు. గత కొంతకాలం నుంచి సంక్రాంతి, ఉగాది పండుగ ఉత్సవాలలో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు తమని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. చివరి నిమిషంలో పర్మిషన్ ఇచ్చామని తూతూ మంత్రంగా చెబుతున్నారని విమర్శించారు. దీనివల్ల ఉత్సవాలు సరిగా జరుపుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే ఈ రెండు పండగల ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. సంక్రాంతికి, ఉగాదికి 5 రోజులు చొప్పున పర్మిషన్‌కి పర్మినెంట్ ఆర్డర్సు ఇప్పించాలని కోరారు. ఈ ఐదు రోజుల్లో ప్రజలకు పనులు కూడా ఉండదని పేర్కొన్నారు. ఇవి జల్లికట్టు కన్నా ప్రమాదకరమైన ఆటలు, సంబరాలు కావని చెప్పుకొచ్చారు. పండగలకు ప్రజలను జైలుకు తీసుకెళ్లే పరిస్థితి తీసుకురావద్దని అన్నారు.