రెడ్డి అయితే ఊగిపోతారు.. దళితులైతే స్పందించరా..? మందకృష్ణ మాదిగ

By telugu teamFirst Published Dec 17, 2019, 8:33 AM IST
Highlights

తెలంగాణలో రెడ్డి యువతి బాధితురాలుగా మారితే.. ఒక ముస్లిం, ముగ్గురు బీసీ యువకుల్ని ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని ఏపీ సీఎం జగన్‌ స్వాగతించారని అన్నారు.

ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మరోసారి.... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మండిపడ్డారు. రెడ్డి కులస్థులకు అన్యాయం జరిగితేనే స్పందిస్తారా..? దళిత విషయంలో ఎందుకు నోరు విప్పరు అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో రెడ్డి కులస్థురాలి హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్‌ను సమర్థించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో అణగారిన వర్గాల మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై ఏం తీర్పునిస్తారో సూటిగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సోమవారం అత్యాచారానికి గురై గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదేళ్ల చిన్నారిని మంద కృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రెడ్డి యువతి బాధితురాలుగా మారితే.. ఒక ముస్లిం, ముగ్గురు బీసీ యువకుల్ని ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని ఏపీ సీఎం జగన్‌ స్వాగతించారని అన్నారు.

వారం రోజుల వ్యవధిలో ఏపీలో మూడు ప్రాంతాల్లో రెడ్ల చేతిలో దళిత మహిళలు బాధితులుగా మారితే... జగన్ లోని ఆవేశం ఏమైందని ప్రశ్నించారు. గుంటూరులో ఐదేళ్ల బాలికై అత్యాచారం కేసులో నిందితుడు లక్ష్మణ్‌రెడ్డి అని, దిశ చట్టం తీసుకొచ్చిన రోజే ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం కేసులో కరుణాకర్‌రెడ్డి నిందితుడుగా ఉన్నారని చెప్పారు. కర్నూలులో గిరిజన యువతిని అత్యాచారం చేసి, హత్యచేసిన నిందితుల్లో రెడ్డి కులానికి చెందిన కే.జనార్దన్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, హర్షవర్ధన్‌ రెడ్డిలను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు

తల్లీకూతుళ్లను దారుణంగా హతమార్చి ఆపై కాల్చివేసిన నిందితుడిది ఏ కులమైనా సరే కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి 48 గంటల్లో న్యాయం చేయకపోతే ధరా చేస్తామని హెచ్చరించారు.

click me!