
వైసీపీ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnam Raju) మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తనపై అనర్హత వేటు వేయించడానికి వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని అన్నారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ నేతలకు సమయమిచ్చానని.. కానీ వాళ్లకు అది సాధ్యపడలేదని చెప్పారు. మరోసారి వారికి ఈనెల 11వరకు సమయమిస్తున్నానని సవాలు విసిరారు. ఢిల్లీలో మంగళవారం రఘురామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే వైసీపీ ప్రభుత్వంపై, వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
తన ఫిబ్రవరి 5వ తేదీన రాజీనామా చేస్తానని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. రాజీనామా విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ‘నా వల్ల కాదు.. నువ్వు రాజీనామా చేయి’ అని సీఎం అడిగితే తాను అప్పుడు చేస్తానని అన్నారు. తాను రాజీనామా చేస్తున్నానని తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో రఘరామ కృష్ణరాజు మాట్లాడుతూ.. తనపై అనర్హత వేటు వేయించలేమని ఒప్పుకోంటే.. అప్పటికిప్పుడు పదవికి రాజీనామా చేస్తాను అంటూ సవాల్ విసిరారు. తనపై అనర్హత వేటు వేయపోతే రాజీనామ చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని చెప్పారు.
ఇక, తాను చింతామణి నాటకంపై వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోనని రఘరామ కృష్ణరాజు చెప్పారు. ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పిటిషన్ వేయలేదని చెప్పారు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రను మాత్రమే తీసేయాలని పిటిషన్ వేసినట్టుగా చెప్పారు. నాటకాన్ని నిషేధించవద్దని చెప్పానని తెలిపారు.
సమ్మెకు దిగుతామని చెప్పిన ఉద్యోగ సంఘాల నాయకులు ఎలా కాళ్ల బేరానికి వచ్చారని రఘరామ కృష్ణరాజు ప్రశ్నించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగనా లేక సజ్జల రామకృష్ణా రెడ్డా అనేది అర్థం కావడం లేదన్నారు.