తల్లి అనారోగ్యానికి ఆయన అరెస్టుకు సంబంధం ఏంటి?...అవినాష్ రెడ్డిపై ఎంపీ రఘురామ మండిపాటు..

By SumaBala BukkaFirst Published May 22, 2023, 2:49 PM IST
Highlights

అవినాష్ రెడ్డి అరెస్టుకు.. ఆయన తల్లి అనారోగ్యానికి సంబంధం ఏంటంటూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామా మండిపడ్డారు. హైదరాబాద్ కు తీసుకురాకుండా కడపకు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. 

ఢిల్లీ : వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి విరుచుకుపడ్డారు. వైయస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ మీద వ్యంగ్యాస్త్రాలు వేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో విచారణకు హాజరయ్యే విషయంలో సిబిఐ విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ లేఖ రాసిన  విషయం తెలిసిందే. దీనిమీద ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో రేపు విచారణకు వస్తుందో, రాదో అవినాష్ రెడ్డికి ఎలా తెలుసు అని సూటి ప్రశ్న వేశారు.

‘రేపు ముందస్తు బెయిల్ మీద సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాబట్టి, హాజరు నుంచి మినహాయింపు కావాలని అవినాష్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో రేపు పిటిషన్ విచారణకు వస్తుందని అవినాష్ రెడ్డికి ఎలా తెలుసు? సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు  బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రావచ్చు.. రాకపోవచ్చు.. దాని ప్రాతిపాదికన  విచారణకు హాజరు కాలేనని ఎలా లేఖ రాస్తారు. 

అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యానికి.. అతని అరెస్టుకు ఏమిటి సంబంధం? అవినాష్ రెడ్డి చెప్పినట్టు నిజంగానే ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోతే.. హైదరాబాదులో చేర్పించాలి. లేదా మరోచోటుకి తీసుకువెళ్లాలి కదా.  హైదరాబాదులో వీరికి అన్ని రకాల సహకారాలు అందవని అలా చేస్తున్నారా? ధర్నాలు, ఆందోళనలు చేసినంత మాత్రాన అరెస్టులు ఆపేస్తారా? కడపలో ఎందుకు చేర్చాల్సి వచ్చింది? కర్నూలులో ఉంటే అక్కడికి దగ్గరవుతుందనా? కర్నూలులో ఉన్నది మన సీఎం.. మన పోలీసులనా? ఇక్కడ ఎందుకు చేర్చారు? నాటకాలు ఆడుతున్నారు.’’ అంటూ అవినాష్ రెడ్డితో పాటు సీఎం జగన్ మీద నర్మగర్భంగా తీవ్రంగా విరుచుకుపడ్డారు.

అవినాష్ విషయంలో సీబీఐ ముందడుగు వేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య.. ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్

ఇదిలా ఉండగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి విచారణకు మూడుసార్లు దూరంగా ఉండడంతో అతడిని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

సీబీఐ అధికారులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి ఇంత హడావిడిగా రావాల్సిన అవసరం లేదని అన్నారు. సిబీఐ అధికారుల విషయం టీవీల్లో వచ్చేసరికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ఆందోళన నెలకొందని. దీంతోనే వైసీపీ శ్రేణులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని చెప్పారు. అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ ఎలాంటి ముందడుగు వేసినా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీబీఐ అధికారులు సహకరించాలని కోరారు. తల్లి ఆరోగ్యం బాగవగానే అవినాష్ రెడ్డి తనంతట తానే విచారణకు సహకరిస్తారని చెప్పారు. 

click me!