అమరాతిలో పేద వాళ్లు ఉండకూదనే మనస్థత్వం వారిది.. అక్కడే 50 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం: సీఎం జగన్

By Sumanth KanukulaFirst Published May 22, 2023, 1:37 PM IST
Highlights

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే.. టీడీపీ, దొంగల ముఠా అడ్డుకునే యత్నం చేసిందని సీఎం జగన్ విమర్శించారు.

మచిలీపట్నం: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే.. టీడీపీ, దొంగల ముఠా అడ్డుకునే యత్నం చేసిందని సీఎం జగన్ విమర్శించారు. రాజధాని పేరు మీద పేదలకు ఏ మాత్రం ప్రవేశం లేని గెటేడ్ కమ్యూనిటీని ప్రభుత్వ సొమ్ముతో కట్టుకుని బినామీల పేరుతో లక్షల కోట్లు గడించాలని చంద్రబాబు చూశారని ఆరోపించారు. సీఎం జగన్ ఈరోజు బందరు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మచిలీపట్నం మండలం తపసిపూడి గ్రామంలో పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ  సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..  ముంబై, చెన్నై మాదిరిగా బందరు మహానగరంగా ఎదిగే అవకాశం ఉందని.. ఆ కల ఇప్పుడు నెరవేరుతోందని అన్నారు. బందర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి అన్ని కోర్టు కేసులను అధిగమించి, భూసేకరణ పూర్తిచేసి అన్ని అనుమతులు తీసుకొచ్చామని చెప్పారు. మచిలీపట్నం పోర్టు వల్ల పక్క రాష్ట్రాలకు ఉపయోగం కలుగుతుందని తెలిపారు. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని చెప్పారు. బందరుకు పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. పోర్టు రాకుండా వేల ఎకరాల భూములను చంద్రబాబు తీసుకున్నారని ఆరోపించారు. అమరావతి దష్టిలో ఉంచుకుని బందరుకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పోర్టుకు ఉన్న గ్రహణాలు తొలగిపోయానని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక మచిలీపట్నం రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు.  మచిలీపట్నాన్ని జిల్లాకేంద్రంగా చేశామని తెలిపారు. 

పేదల సంక్షేమానికి కట్టుబడి అనేక కార్యక్రమాలు చేపట్టామని.. డీబీటీ ద్వారా లంచాలు లేకుండా, వివక్షా తావివ్వకుండా ఈ కార్యక్రమాలు అమలుచేస్తున్నామని చెప్పారు. నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామనితెలిపారు. ఇప్పటికే 30 లక్షల ఇళ్లపట్టాలను అక్క చెల్లెమ్మల పేరుతో వారికి అందించామని చెప్పారు. అమరావతి ప్రాంతంలో కూడా 50వేల మందికి నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభించామని చెప్పారు.

అయితే ఆ యజ్ఞానానికి టీడీపీ, గజదొంగల ముఠా అడ్డుపడుతోందని విమర్శించారు. దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడమే వారి పని అని మండిపడ్డారు. బినామీల పేరుతో భూములు గడించి లక్షల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. అమరావతిలో పేద వాళ్లు పాచి పనులు చేయలట..రోజువారీ పనులు చేసే కార్మికులుగానే ఉండాలంట.. అమరావతిలో వీళ్ల పొద్దుటే ఎంటర్‌ కావాలంట, పనులు చేసి తిరిగి వెనక్కి పోవాలంట.. ఇంతటి సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా? అని ప్రశ్నించారు.  ఇటువంటి దారుణమైన మనస్థత్వంతో కూడిన రాక్షసుడితో యుద్దం చేస్తున్నామని చెప్పారు. 

ఆ పేదల తలరాతలు మార్చాలని.. అమరావతిలో 50 వేల మంది ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా.. ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నట్టుగా చెప్పారు. ఈ నెల 26న అక్కడే ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టనున్నట్టుగా తెలిపారు. 

చంద్రబాబు ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని అనుకుంటారా? అని వారిని అవమానించారని అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానని దారుణంగా అవమానించారని విమర్శించారు. మహిళలను కూడా దారుణంగా అవమానించిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. మూడు రాజధానులను వద్దని అన్ని ప్రాంతాలను అవమానించాడని.. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం వద్దని పేదవారిపై దాడి చేశారని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులో కేసులు వేయిస్తుంది చంద్రబాబేనని ఆరోపించారు. 

click me!