అవినాష్ విషయంలో సీబీఐ ముందడుగు వేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య.. ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్

By Sumanth KanukulaFirst Published May 22, 2023, 2:10 PM IST
Highlights

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి సీబీఐ అధికారులు ఇంతా హడావిడిగా రావాల్సిన అవసరం లేదన్నారు.

కర్నూలు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మూడు సార్లు విచారణకు దూరంగా ఉండటంతో సీబీఐ అధికారులు ఈరోజు తెల్లవారుజామున కర్నూలు చేరుకున్నారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటుతో కర్నూలులోకి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆయన గత నాలుగు రోజులగా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు కర్నూలు చేరుకోవడం.. జిల్లా ఎస్పీతో చర్చలు జరపడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి సీబీఐ అధికారులు ఇంతా హడావిడిగా రావాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయం టీవీల్లో వచ్చేసరికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో ఇక్కడికి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడం జరిగిందని చెప్పారు. అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ ఎలాంటి ముందడుగు వేసినా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీబీఐ అధికారులు సహకరించాల చేయాలని కోరారు. తల్లి ఆరోగ్యం బాగవగానే అవినాష్ రెడ్డి విచారణకు సహకరిస్తారని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అయితే మే 16, మే 19వ తేదీల్లో రెండు విచారణ తేదీలను అవినాష్ రెడ్డి దాటవేశారు.తాజా ఈరోజు(మే 22) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ప్రస్తుతం తన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున్న విచారణకు హాజరయ్యేందుకు 5 రోజుల సమయం కావాలని  కోరారు. ఇక, ఈ నెల 19 నుంచి అవినాష్ రెడ్డి తన తల్లి లక్ష్మమ్మ చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆస్పత్రిలో ఉండిపోయారు.

అయితే ఈరోజు ఉదయం సీబీఐ అధికారులే నేరుగా కర్నూలుకు చేరుకోవడంతో ఏ విధమైన పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్రిక్తత నెలకొంది. కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో చర్చలు జరుపుతున్నారు. శాంతి భద్రతలకు సంబంధించి సీబీఐ అధికారులు ఎస్పీతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అధికారం ఉందని సీబీఐ అధికారులు చెప్పినట్టుగా సమాచారం. 

click me!