ఏపీలో జనసేనతోనే బీజేపీ పొత్తు.. టీడీపీతో ఆ ఆలోచన లేదు : లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Sep 30, 2022, 04:14 PM IST
ఏపీలో జనసేనతోనే బీజేపీ పొత్తు.. టీడీపీతో ఆ ఆలోచన లేదు : లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందన్న వార్తలపై స్పందించారు ఆ పార్టీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. అక్కడ జనసేనతో తప్పించి మరే పార్టీతోనూ కలిసి వెళ్లడం లేదన్నారు. టీడీపీతో పొత్తు ఆలోచనే లేదని ఆయన తేల్చిచెప్పారు.   

తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్ధితులపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశంపై ఆయన స్పందిస్తూ.. అక్కడ జనసేనతో తప్పించి మరే పార్టీతోనూ కలిసి వెళ్లడం లేదన్నారు. టీడీపీతో పొత్తు ఆలోచనే లేదని.. అటు ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, అక్కడి ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. అటు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ బీజేపీదే అధికారం అని ఆయన జోస్యం చెప్పారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టనున్న జాతీయ పార్టీపైనా లక్ష్మణ్ స్పందించారు. కేసీఆర్ కొత్త పార్టీని స్వాగతిస్తున్నాని ఆయన వ్యాఖ్యానించారు. 

అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను, పాలనను గాలికొదిలేసిందని ఆయన దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని, కేంద్రాన్ని, ప్రధాని మోడీని విమర్శించడమే ఏకైక ఏజెండాగా టీఆర్ఎస్ పెద్దలు పనిచేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం పేరుతో టీఆర్ఎస్ వీధి నాటకాలు ఆడుతోందని ఆయన విమర్శించారు. బయ్యారంపై విభజన చట్టంలో ఫీజుబిలిటీ స్టడీ చేయాలని మాత్రమే వుందన్నారు. అక్కడ నాణ్యమైన ముడి ఖనిజం లేదని నిపుణులు తేల్చారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ అంశాలను కేంద్ర మంత్రి రాజ్యసభలోనే ప్రకటించారని మంత్రి వెల్లడించారు. 

ALso REad:ఏపీలో జనసేనతో కలిసే ముందుకు.. రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నాం: ఎంపీ జీవీఎల్

తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అమలు కావాలని.. జాతీయ పార్టీ పెడతానంటూ కేసీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని కిషన్ రెడ్డి చురకలంటించారు. తెలంగాణలో ఏమీ సమస్యలు లేవని.. ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలంతా సంతోషంగా వున్నారని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెక్రటేరియట్‌కు సీఎం రాకుండా పరిపాలన చేయడం, వున్న సెక్రటేరియట్‌ను కూలగొట్టడం, మంత్రికి కేబినెట్‌లో స్థానం లేకుండా నడపడమా తెలంగాణ మోడల్ అంటే అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఏం చూసి దేశప్రజలు మీకు స్వాగతం పలుకుతారని ఆయన నిలదీశారు. 

ప్రజలను కలవకుండా తొమ్మిదేళ్లుగా .. సగం రోజులు ప్రగతి భవన్‌లో, సగం రోజులు ఫామ్ హౌస్‌లో కేసీఆర్ కాలం గడిపారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ దొంగ మాటలు మాట్లాడుతూ.. తొండి వాదన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కట్టకపోతే తామే బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కడతామని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ అన్న మాటలు ఏమయ్యాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పది నుంచి 15 వేల మందికి తాము ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ చెప్పారని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. దమ్ముంటే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని.. తాము ఎప్పుడూ మాట ఇవ్వలేదని కిషన్ రెడ్డి అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్