కేసీఆర్ ను తిడితే సంతోషపడుతారేమో: హరీష్ రావుకు ఏపీ మంత్రి గుడివాడ కౌంటర్

By narsimha lodeFirst Published Sep 30, 2022, 3:45 PM IST
Highlights

తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కౌంటరిచ్చారు. తెలంగాణను చూసి నేర్చుకోవాల్సిన దుస్థితిలో తాము లేమన్నారు. 

విశాఖపట్టణం: కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితిలో తమ ప్రభుత్వం లేదని ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ శుక్రవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీపై చేసిన విమర్శలపై ఆయన కౌంటరిచ్చారు. 

కేసీఆర్ తో సమస్యలుంటే ఆ రాష్ట్రంలోనే తేల్చుకోవాలని హరీష్ రావుకు సూచించారు మంత్రి అమర్‌నాథ్.. హరీష్ రావు వ్యాఖ్యలపై తాము కేసీఆర్ ను తిడితే హరీష్ రావు ఆనందపడతారేమోనన్నారు. ఈ కారణంతోనే తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అమర్ నాథ్ మండిపడ్డారు. 

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇక్కడికి వచ్చి చూస్తే అర్ధమౌతుందన్నారు. టీఆర్ఎస్ పాలనను చూసి నేర్చుకోవాల్సిన అవసరం  తమకు లేదని చెప్పారు. ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ తెలంగాణలో ఏ మేరకు అభివృద్ది సాధించిందో చెప్పాలని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. 

also read:ఓ గ్యాంగ్ మాటలనే వల్లే వేశారు:హరీష్ రావుకు సజ్జల కౌంటర్

మూడేళ్లలో తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్తుందన్నారు. మమ్మల్ని తిడితే కేసీఆర్ వద్ద మీకు మార్కులు పడతాయా అని హరీష్ రావును మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. హైద్రాబాద్ ఉండడం వల్ల తమ రాష్ట్రం కంటే తెలంగాణ ఆర్ధికంగా బాగుందని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ అధికారులను ఏ రకంగా చూశారో ప్రజలకు తెలుసునని మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. ఏపీ భవన్ లో నోటికొచ్చినట్టు ఓ అధికారిని దూషించి బూటు కాలితో  హరీష్ రావు తన్నలేదా అని అమర్ నాథ్ అడిగారు. తమకు సలహలు ఇచ్చే నైతిక హక్కు ఆ ప్రాంతానికి చెందిన నేతలకు లేదని మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. 

ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్నపరిణామాలను ప్రస్తావిస్తూ  మంత్రి హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. . కానీ తెలంగాణలో  మాత్రం టీచర్లకు 73 శాతం పిట్ మెంట్ ఇచ్చామన్నారు. ఏపీ ప్రభుత్వం వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగిస్తుందన్నారు. కేంద్రం షరతుల మేరకు  వ్యవసాయ మోటార్లకు ఏపీ ప్రభుత్వం మీటర్లు బిగిస్తుందని ఆయన విమర్శించారు. ఇటీవల తిరుపతికి వెళ్లిన సమయంలో కొందరితో తాను మాట్లాడానన్నారు. విద్యుత్ విషయంలో తాముఇబ్బందులు పడుతున్నట్టుగా ఏపీ వాసులు చెప్పిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. దీంతో తెలంగాణ నేతలను ఏపీకి పంపిస్తే తెలంగాణ ఏ రకంగా ముందుందో తెలుస్తుందన్నారు హరీష్ రావు 
 

click me!