మూడు దశాబ్దాల తర్వాత... తల్లీ కొడుకులను ఒక్కటిచేసిన సోషల్ మీడియా

By Arun Kumar PFirst Published Nov 24, 2020, 12:02 PM IST
Highlights

32ఏళ్ళ క్రితం దూరమైన తల్లీ కొడుకులను ఒక్కదగ్గరికి చేర్చి ఆ కుటుంబంలో ఆనందాన్ని నింపింది సోషల్ మీడియా. 

రాజమండ్రి:  యువతను పెడదారి పట్టిస్తుందని విమర్శలపాలవుతున్న సోషల్ మీడియానే తాజాగా మానవత్వాన్ని చాటుకుంది. 32ఏళ్ళ క్రితం దూరమైన తల్లీ కొడుకులను ఒక్కదగ్గరికి చేర్చి ఆ కుటుంబంలో ఆనందాన్ని నింపింది సోషల్ మీడియా. ఇలా తనపై విమర్శలు చేస్తున్న వారినుండి ఈ ఒక్క మానవీయ సంఘటనతో ప్రశంసలు పొందుతోంది సోషల్ మీడియా. 

వివరాల్లోకి వెళితే... కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నాగశయనం తల్లి పద్మావతి 32ఏళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త ఆంజనేయులుతో గొడవపడి కొడుకును వదిలి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇలా 32ఏళ్లపాటు ఎక్కడ బ్రతికిందో ఏమోగానీ ఇటీవల ఆమె రాజమండ్రికి చేరుకుని లాలాచెరువు కాలనీలో ఉంటోంది. 

70ఏళ్ల వృద్దురాలు ఇలా నిరాశ్రయురాలై ఒంటరిగా జీవిస్తుండటం చూసి చలించిపోయిన రాజమండ్రి పోలీస్టేషన్ లో కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్న సూర్యనారాయణ ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఆమె గతం గురించి తెలుసుకుని కొడుకు వద్దకు చేర్చడానికి సోషల్ మీడియాను ఆశ్రయించాడు. ఫేస్ బుక్ లో వృద్దురాలి ఫోటోతో పాటు ఆమె వివరాలను పోస్ట్ చేశాడు. ఇది కాస్త ఒకరి నుండి మరొకరికి చేరుతూ చివరకు కొడుకు నాగశయనం వద్దకు చేరింది. 

ఫోటోలో వున్నది తన తల్లిగా గుర్తించిన అతడు రాజమండ్రికి చేరుకున్నాడు. త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ దుర్గాప్రసాద్‌ పద్మావతిని ఆమె కుమారుడు నాగశయనంకు అప్పగించారు. 32 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీతనయుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

click me!