కొడుకు విదేశాలకు వెడుతున్నాడని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య..

By SumaBala BukkaFirst Published Dec 22, 2022, 2:18 PM IST
Highlights

వద్దంటే వినకుండా కొడుకు విదేశాలకు వెడుతున్నాడని ఓ తల్లి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది.

నెల్లూరు : పిల్లలు విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని, గొప్ప స్థాయిలో ఉద్యోగాలు చేయాలని  తల్లిదండ్రులు కలలు కంటూ ఉంటారు. తమ పిల్లలు విదేశాల్లో ఉన్నారని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతుంటారు. అయితే నెల్లూరు జిల్లాలో ఓ తల్లి మాత్రం తనను విడిచి తన కొడుకు  విదేశాలకు వెడుతున్నాడని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నెల్లూరులోని న్యూ మిలిటరీ కాలనీలో ఉండే చల్లా పెంచల నరసింహా రెడ్డి, విజయ కుమారి దంపతులకు.. ఇద్దరు కొడుకులు. వారి పేర్లు సదాశివ రెడ్డి, భరత్ రెడ్డి.

పెద్ద కొడుకు సదాశివరెడ్డి బిటెక్ కంప్లీట్ చేశాడు. చిన్న కొడుకు భరత్ రెడ్డి కూడా చదువు పూర్తి చేసి.. బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా సదాశివరెడ్డి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే తల్లిదండ్రులకు అది ఇష్టం లేదు. కొడుకుకు విదేశాలకు వెల్లొద్దని.. ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుని చేసుకోవాలని చెప్పుకొచ్చారు. కానీ సదాశివరెడ్డి విదేశాలకు వెళ్లాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో పెంచల నరసింహా రెడ్డి ఇటీవలే అయ్యప్పమాల వేసుకున్నాడు.  డిసెంబర్ 18వ తేదీన శబరిమలకి వెళ్ళాడు. 

పెరుగుతున్న చలిగాలులు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం : ఐఎండీ

తండ్రి ఇంట్లో లేనిది చూసిన సదాశివరెడ్డి తల్లి విజయ కుమారితో తాను విదేశాలకు వెళ్తానని మరోసారి చెప్పాడు. అయితే, పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలు చూసుకోకుండా.. విదేశాల ప్రస్తావన తెస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె కొడుకురే చెబుతూ ఉండేది. తల్లి మాటలను అంత సీరియస్గా తీసుకొని సదాశివరెడ్డి.. ఈనెల 25వ తేదీన ఫారిన్ వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇది తెలిసిన విజయ కుమారి తీవ్ర మనస్థాపానికి గురి అయింది. బుధవారం బెడ్ రూమ్ లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు.. ఆమెను వెంటనే నగరం లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

అయితే హాస్పిటల్ కి వెళ్ళే సరికి ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి మృతి మీద వేదాయపాలెం పోలీసులకు చిన్న కొడుకు భరత్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జిజిహెచ్ కు తరలించారు. ఈ మృతి మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!