ఏపి అంటే మోడికి ఎందుకంత కోపం ?

Published : Sep 03, 2017, 12:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఏపి అంటే మోడికి ఎందుకంత కోపం ?

సారాంశం

నరేంద్రమోడికి మొదటి నుండి ఏపిపై ఏదో కోపం ఉన్నట్లే కనబడుతోంది. ఎందుకంటే, అవసరమొచ్చినప్పుడల్లా మొండిచెయ్యి చూపిస్తుండటంతో అనుమానాలు బలపడుతున్నాయి. మోడి కోపం రాష్ట్ర విభజన హామీల అమలతో మొదలై తాజా మంత్రివర్గ విస్తరణలో కూడా బయటపడింది.

నరేంద్రమోడికి మొదటి నుండి ఏపిపై ఏదో కోపం ఉన్నట్లే కనబడుతోంది. ఎందుకంటే, అవసరమొచ్చినప్పుడల్లా మొండిచెయ్యి చూపిస్తుండటంతో అనుమానాలు బలపడుతున్నాయి. మోడి కోపం రాష్ట్ర విభజన హామీల అమలతో మొదలై తాజా మంత్రివర్గ విస్తరణలో కూడా బయటపడింది. విభజనతో అన్ని విధాల నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేకహోదా, ప్రత్యేకరైల్వేజోన్, రూ. 16 వేల కోట్ల ఆర్ధికలోటు భర్తీ తదితరాలు అమలు చేయాల్సి ఉంది. అయితే, వీటిల్లో ఏ ఒక్కదాన్నీ ప్రధాని పట్టించుకోలేదు.

వీటికి అదనంగా అనేక చిన్నా, చితక హామీలున్నప్పటికీ అసలు వాటికే దిక్కు లేదు కాబట్టి వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేకహోదానే రద్దవుతుందని, దేశంలోని ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఉండదని ఊరూ వాడా ఊదరగొట్టింది కేంద్రం. కాబట్టి ఏపికి కూడా ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని చెప్పటంతో నిజమే అనుకున్నారు. కానీ, ఇప్పటికే ప్రత్యేకహోదాను అనుభవిస్తున్న 11 రాష్ట్రాలకు ఆర్ధిక ప్రయోజనాలను మరికొంత కాలం వర్తింపచేయాలని క్యాబినెట్ నిర్ణయించటంతోనే కేంద్రం ఇంతకాలం అబద్దాలు చెప్పిందని తేలిపోయింది.

ఇక, తాజా మంత్రివర్గ విస్తరణలో కూడా ఏపికి మొండిచెయ్యే మిగిల్చారు మోడి. కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా పంపించారు. కాబట్టి ఆ స్ధానం ఖాళీ అయ్యింది. ఆ స్ధానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే, ఆస్దానాన్ని ఖాళీగా ఉంచేయాలని మోడి నిర్ణయించినట్లు తాజాగా తేలిపోయింది. మంత్రిపదవిని ఎవరితోనైనా భర్తీ చేయొచ్చుగానీ వెంకయ్యకు ప్రత్యామ్నాయంగా ఎవరినీ తీసుకోలేదు. ఇక్కడే మోడి వైఖరిపై అందరికీ అనుమానాలు వస్తున్నాయ్. ఉద్దేశ్యపూర్వకంగానే మోడి రాష్ట్రాన్ని అన్నింటికీ దూరంగా ఉంచుతున్నారా అన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి.

                                          హరిబాబుకు పెద్ద హ్యాండ్

విశాఖపట్నం ఎంపీ హరిబాబుకు ఖరారైందనుకున్న మంత్రి పదవి ఆఖరి నిమిషం లో జారిపోయింది. కుటుంబంతో కలిసి అత్యంత ఉత్సాహంతో ఢిల్లీ కి వెళ్లిన ఆయనకు తీవ్ర నిరాశే ఎదురైంది. 2014 ఎన్నికల ప్రచారం లో ఇఛ్చిన హామీలు నెరవేర్చక పొతే ఐదు కోట్ల ఆంధ్రులు ఎంత నిరాశకు లోనయ్యారో ఇప్పుడు హరిబాబు కు ప్రత్యక్షం గా అనుభవంలోకి వచ్చే ఉంటుంది.

 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu