ప్రతిపక్షాలు హేళన చేశాయి... అదే ఇప్పుడు కరోనా నుండి కాపాడుతోంది: మంత్రి మోపిదేవి

By Arun Kumar PFirst Published Mar 23, 2020, 3:32 PM IST
Highlights

ఏపిపై కరోనా వైరస్ ప్రభావంపై మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందిస్తూ రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న దళారులను తీవ్రంగా హెచ్చరించారు.  

అమరావతి: కరోనా  మహమ్మారి నుండి కాపాడుకోవడం కోసం అనేక దేశాలు కృషి చేస్తున్నాయని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు చేపట్టిందని అన్నారు. జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేశారని... ఇదే విధంగా లాక్ డౌన్ కాలంలో ప్రజలెవ్వరూ ఇళ్లలో నుండి బయటకు రాకూడదని సూచించారు. ప్రజల సహకారం లేకుంటే కరోనాను కట్టడి చేయడం కుదరదని... కాబట్టి ప్రతిఒక్కరు స్వీయనిర్భందాన్ని పాటించాలని మోపిదేవి సూచించారు.  

ఇప్పగికే 13,000 మంది ఇతర దేశాల నుండి ఏపికి వచ్చారని ... వారంతా ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో వున్నారని అన్నారు. ఇప్పటివరకు కేవలం కొద్ది మంది మాత్రమే ఈ వైరస్ బారిన పడ్డారని... అతి తక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. 

కరోనా కట్టడికి వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడుతోందన్నారు. వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్ష నాయకులు హేళన చేశారని... ఇప్పుడదే ప్రజలను కాపాడుతోందన్నారు. ప్రభుత్వం వాలంటీర్లను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ  కరోనా అనుమానితులను గుర్తిస్తోందని మోపిదేవి తెలిపారు.

ముందుగా విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి హోం ఇసోలేషన్ లో ఉంచడం వల్ల రాష్ట్రం కొంత సేఫ్ జోన్ లో ఉందన్నారు. అయితే ఈ వైరస్ పై పోరాడేందుకు ప్రజల సహకారం ఇంకా సంపూర్ణంగా కావాలన్నారు.  

నిత్యావసర వస్తువుల రవాణాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిద విభాగాలను ఆదేశించిందన్నారు. పలు సమస్యులు ఆక్వా, పౌల్ట్రీ రంగాలు ఇబ్బంది పెడుతున్నాయని... ఫీడ్, సీడ్ సకాలంలో అందక పోతే రైతులు తీవ్రంగా నష్ట పోతారని అన్నారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ సంబంధించి ఇబ్బందులు కలిగించ వద్దని కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.  

ఎగుమతులు తగ్గడంతో రైతులు పండించిన పంటను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుందని కొన్ని చోట్లనుండి  ఫిర్యాదులు  అందాయని...దీనిపై కూడా చర్యలు తీసుకుని రైతులను ఆదుకుంటామని మంత్రి హామీ  ఇచ్చారు. ఇప్పటికే చైనాలో ఎగుమతులు, దిగుమతులు ప్రారంభమయ్యాయని...ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. 

ప్రాసెసింగ్ యూనిట్స్ లో 1500 మంది స్టాఫ్ ఉంటారని తెలిపారు. సాధారణంగా ప్రాసెసింగ్ యూనిట్స్ లో జాగ్రత్తలు తీసుకుంటారని... ఇంకా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశామన్నారు. జాగ్రత్తలు పాటించకోపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లు మూసేస్తారు అని మధ్యవర్తులు ప్రచారం చేస్తున్నారని... ప్రాసెసింగ్ యూనిట్లు మూసేసే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. మధ్యవర్తులు రైతులను దోచుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. 
 

click me!