
తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు అలియాస్ అనంత ఉదయ భాస్కర్‌కు కోర్టు రిమాండ్ పొడిగించింది. అనంతబాబుకు గతంలో కోర్టు విధించిన రిమాండ్ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను జూమ్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలోనే జూలై 1వ వరకు అనంతబాబుకు రిమాండ్ విధిస్తూ రాజమండ్రి కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మే 23 నుంచి అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రిమాండ్ పొడగిస్తూ కోర్టు తీర్పు నేపథ్యంలో.. అనంతబాబు జూలై 1 వరకు జైలులోనే ఉండనున్నారు.
ఇప్పటికే అనంతబాబు బెయిల్ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్‌ను అధికారులు కొట్టివేశారు. రెండు రోజుల క్రితం కూడా ఎమ్మెల్సీ అనంత బాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే కొట్టివేసిన సంగతి తెలిసిందే. అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ మంజూరు చేయడానికి నిందితుడి తరపు న్యాయవాది సరైన కారణాలు చూపనందువల్ల బెయిల్ పిటిషన్ ను రద్దు చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.