
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే ఎస్పీ అనురాధ ఆదివారం వెల్లడించారు. ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేసి, చంచల్‌గూడ జైలుకు రిమాండ్ చేశామని తెలిపారు. రెండు వేల మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారని ఆమె చెప్పారు. కోచింగ్ సెంటర్లు ఆర్మీ ఉద్యోగార్థుల్ని రెచ్చగొట్టాయని.. సదరు కోచింగ్ సెంటర్లను గుర్తించామని అనురాధ తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి ఘటనపై రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసు తదుపరి విచారణ నిమిత్తం హైదరాబాద్ నగర పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు అనురాధ తెలిపారు.
‘‘ఇది ఒక ప్రధాన సమస్య. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలకు అనుసంధానించబడినందున.. ఈ కేసును హైదరాబాద్ నగర పోలీసులకు బదిలీ చేయడానికి నిర్ణయం తీసుకోబడింది’’ అని ఆమె చెప్పారు. ఈ కేసులో అరెస్టయిన వారంతా తెలంగాణ వాసులేనని అనురాధ తెలిపారు. ఇతర రాష్ట్రాల వ్యక్తుల పాత్ర దర్యాప్తు చేయబడుతోందన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇంటెలిజెన్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు కూడా రంగంలోకి దిగాయి.
తెలుగు రాష్ట్రాల్లోని డిఫెన్స్ కోచింగ్ అకాడమీలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీలో ఐబీ, ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్టుగా ఎన్టీవీ న్యూస్ చానల్ రిపోర్ట్ చేసింది. ఇక, అధికారులు సాయి డిఫెన్స్ అకాడమీలో రికార్డులు, ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సికింద్రాబాద్ అల్లర్ల వెనక సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు పాత్ర ఉందా..?, లేదా..? అనే విషయంలో పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. అతడిని గోప్యంగా విచారిస్తున్నారు.
ఇదిలా ఉంటే సుబ్బారావును అదుపులోకి తీసుకోలేదని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. రైల్వేస్టేషన్‌పై దాడి ఘటనలో సుబ్బారావును ప్రశ్నిస్తున్నామని చెప్పారు. భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో సోమవారం ఉదయం నరసరావుపేట రైల్వే స్టేషన్‌ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా యన మీడియాతో మాట్లాడుతూ... అభ్యర్థులు నిరసన తెలిపి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని సూచించారు. సుబ్బారావు విషయంలో తెలంగాణ పోలీసులు తమను సంప్రదించలేదని చెప్పారు. యూపీ పోలీసులు సుబ్బారావును విచారించారించినట్టుగా వార్తలు వస్తున్నాయని మీడియా ప్రశ్నించగా.. అందులో వాస్తవం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు సుబ్బారావు విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.