
అమరావతి : ‘మంత్రిగారూ కంగ్రాచ్యులేషన్స్’ అంటూ మంగళవారం పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు వారి సహచరులు సరదాగా శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు జరిగిన YCP శాసనసభా పక్ష సమావేశంలో.. మంత్రివర్గాన్ని అతి త్వరలో పునర్వవస్థీకరిస్తున్నట్లు సీఎం YS Jagan ప్రకటించారు. సమావేశం ముగిశాక.. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం ఉందన్న ప్రచారం నేపత్యంలో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కొలుసు పార్థ సారథి తదితరులకు వారి సహచర ఎమ్మెల్యేలు అభినందనలు తెలపడం Assembly లాబీల్లో కనిపించింది.
ఆ మూడు పార్టీలు కలుస్తాయా?
పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ లాబీల్లో ప్రధానంగా అధికార పక్ష సభ్యుల మధ్య చర్చ సాగింది. జనసేన ఇప్పటికే బీజీపీతో కలిసి ఉంది. వారితో టీడీపీ కలిసే అవకాశం ఉంటుందంటూ పలువులు ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు వేర్వురుగా చర్చించుకోవడం కనిపించింది. ఆ మూడు పార్టీలు కలిస్తే వైసీపీకి ఎలాంటి పరిస్తితులు ఎదురవుతాయి? అని కొందరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు.
ఇదిలా ఉండగా, 2024 అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతికి ఎమ్మెల్యేల పనితీరు, గెలుపు అవకాశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదినట్లు సమాచారం. ఇదే ఇప్పుడు వైసిపి ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతోంది. ఈ రిపోర్ట్ ఆధారంగా దాదాపు 50మంది వైసిపి ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత గుర్రుగా వున్నట్లు సమాచారం. వివిధ కారణాలతో ప్రజలు తిరస్కరించే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తేలడంతో దాదాపు 50మంది ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు వైసిపి అధినేత సిద్దమయినట్లు సమాచారం.
వివిధ అవినీతి ఆరోపణలు, పనితీరు సరిగ్గా లేకపోవడం, నియోజవర్గ ప్రజలకు అందుబాటులో వుండకపోవడం వంటి కారణాలతో కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటపెట్టింది. దీంతో ఇలాంటివారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వకూడదని సీఎం నిర్ణయించుకున్నారట. ఇక మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ బలోపేతానికి పాటుపడుతూ నిబద్దతగా వుండకపోవడం, ఏ క్షణానయినా పార్టీ మారే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటపెట్టింది. దీంతో ఇలాంటివారిపై కూడా వేటుకు సీఎం జగన్ సిద్దపడినట్లు తెలుస్తోంది.
ఇలా తొలిసారి ఎన్నికైన దాదాపు 30మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని జగన్ కు రిపోర్ట్ అందిందట. వివిధ కారణాలతో వీరి గెలుపు అవకాశాలు కూడా సన్నగిల్లడంతో మరోసారి అవకాశం ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారట. అలాగే మరో 12 మంది సీనియర్ ఎమ్మెల్యే, ఎనిమిది మంది మహిళా ఎమ్మెల్యేల తీరుపై ప్రజలు అసంతృప్తితో వున్నారట. ఇలా 150మంది వైసిపి ఎమ్మెల్యేల్లో 50మంది తిరిగి గెలిచే అవకాశాలు లేకపోవడంతో వారిపై వేటుకు పార్టీ అధినేత జగన్ సిద్దమయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.