రైతులపై ఎంఎల్ఏ దౌర్జన్యం

First Published Apr 8, 2018, 11:22 AM IST
Highlights
భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరటమే రైతుల పాపమైపోయింది

రాజధాని రైతులపై గన్నవరం టిడిపి ఎంఎల్ఏ వల్లభనేని వంశీ దౌర్జన్యానికి దిగటం సంచలనంగా మారింది. భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరటమే రైతుల పాపమైపోయింది. వారి డిమాండ్ తో ఒళ్ళమండిపోయిన వంశీ రైతులను తన ఆఫీసుకు పిలిపించుకుని మరీ దౌర్జన్యం చేయటం విచిత్రంగా ఉంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, గన్నవరం విమానాశ్రయం విస్తరణలో భాగంగా పెద్ద అవుటుపల్లి గ్రామంలో కూడా అధికారులు రైతుల భూములను సేకరించారు. అయితే, భూములు కోల్పోయిన రైతుల్లో షేక్ మదార్ సాబ్, మేడూరి తిరుపతయ్య అనే రైతులకు నష్ట పరిహారం దక్కలేదు.

నష్టపరిహారం కోసం రైతులు అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. నష్టపరిహారం చెల్లించకుండానే వారి భూముల్లో అధికారులు పనులు మొదలుపెట్టారు.

అందుకని పనులను రైతులు, వారి కుటుంబాలతో అడ్డుకున్నారు. దాంతో కాంట్రాక్టర్ అదే విషయాన్ని ఎంఎల్ఏకి చేరవేయగా వంశీ రంగంలోకి దిగేశారు. బాధిత రైతులను, కుటుంబాలను తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. అక్కడ కూడా రైతులు తమ వాదనను వినిపించగా ఎంఎల్ఏకి మండిపోయింది.

అదే విషయమై వారితో వాదనకు దిగారు. దాంతో రైతులు కూడా గట్టిగా మాట్లాడగా ఒక్కసారిగా వంశీ వారిపై విరుచుకుపడ్డారు. ఓ రైతును చొక్కా పట్టుకుని తన కార్యాలయంలో నుండి బయటకు ఈడ్చుకుంటూ వెళ్ళి బయటకు తోసేశారు.

ఎప్పుడైతే ఎంఎల్ఏ ఓ రైతుపై చేయి చేసుకున్నారో అక్కడే ఉన్న అనుచరులు ఎందుకూరుకుంటారు? మిగిలిన వారిని అనుచరులు చితకబాదేశారు. దాంతో బాధితులు ఎంఎల్ఏ కార్యాలయం ముందే ధర్నాకు దిగారు. వెంటనే  పోలీసులొచ్చి వారిని స్టేషన్ కు తరలించారు. అంతేకాకుండా బాధితులపైనే కేసులు పెట్టారు.

click me!