ఏపీ ప్రజలు రాక్షసులా..?: తెలంగాణ మంత్రిపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా

By telugu news teamFirst Published Jun 23, 2021, 7:38 AM IST
Highlights

కలిసి మెలిసి ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు రేపేలా మాట్లాడటం ఎంత మాత్రం సరికాదన్నారు. కేటాయింపులు లేకుండా చుక్క నీటిని కూడా వాడుకోవడం లేదని పేర్కొన్నారు.

కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని... ప్రాంతాలు విడిపోయినా.. తెలుగువారంతా ఒక్కటేనని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తించాలని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఏపీ ప్రజలను కించపరుస్తూ చేసిన కామెంట్స్ పై రోజా, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను రాక్షసులంటూ మాట్లాడటం దారుణం అని, దుర్మార్గం అని మండిపడ్డారు. కలిసి మెలిసి ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు రేపేలా మాట్లాడటం ఎంత మాత్రం సరికాదన్నారు. కేటాయింపులు లేకుండా చుక్క నీటిని కూడా వాడుకోవడం లేదని పేర్కొన్నారు.

కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపుల్లో రాష్ట్ర విభజన చట్టం ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాలువ పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులను ఆపాలని... అక్రమ ప్రాజెక్టులను మాట్లాడటం సరికాదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని గౌరవించడం లేదన్నారు. కేటాయింపులే లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు పాత ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుతోందన్నారు. 8 అక్రమ ప్రాజెక్టుల ద్వారా 178 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతోందన్నారు.

ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ప్రజల మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన వైఎస్ఆర్ ను తూలనాడటం తెలంగాణ మంత్రులు, నాయకులకు తగదని సూచించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మహానేత ప్రాజెక్టులు చేపట్టారన్నారు. సీఎం జగన్ కూడా ఎంతో పారదర్శకతతో వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రానికి లేని కేటాయింపులు వాడుకోవాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు.

click me!