ఆ ఎంఎల్ఏనే పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారా ?

First Published Mar 20, 2017, 8:20 AM IST
Highlights

పదే పదే ఒకే ఎంఎల్ఏని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావటం లేదు.

పోలీసులు అధికార పార్టీ ఎంఎల్ఏ గౌతు శ్యామ్ సుందర్ శివాజీని లక్ష్యంగా చేసుకున్నారా? జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవునన అనిపిస్తోంది. పదే పదే ఒకే ఎంఎల్ఏని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావటం లేదు. ఈరోజు ఉదయం విజయవాడకు సమీపంలోని కరకట్ట మీదుగా వెలగపూడిలోని అసెంబ్లీకి వెళుతున్న  శ్రీకాకుళం జిల్లా పలాస ఎంఎల్ఏను పోలీసులు అడ్డుకున్నారు. కరకట్టమీదుగా వెళ్ళేందుకు లేదంటూ శివాజీ కారును నిలిపేసారు. కారణమేంటంటే మరో గంటలో సిఎం అదేదారిలో అసెంబ్లీకి వెళతారట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి.

సిఎం వచ్చే గంట ముందునుండి ఆ దారిలో ఇంకెవరూ తిరిగేందుకు లేదా? ఏదో పదినిముషాల్లో వస్తారనుకుంటే అర్ధం ఉంది. సరే మామూలు వాళ్లను తిరగ్గూడదన్నారంటే ఏదోలే అనుకోవచ్చు. మరి ఎంఎల్ఏ అందులోనూ అధికారపార్టీ ఎంఎల్ఏను కూడా పోలీసులు నిలిపేయటం విచిత్రంగానే ఉంది. అంటే పోలీసులు తామేమనుకుంటే అదే చేస్తారన్నది అర్ధమైపోతోంది.

అందుకనే పోలీసుల వైఖరికి నిరసనగా ఎంఎల్ఏ రోడ్డుపైనే దాదాపు గంటకుపైగా బైఠాయించారు. తనను పోలీసులు పదేపదే అడ్డుకుంటున్నట్లు ఎంఎల్ఏ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆమధ్య శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబునాయుడు వచ్చినపుడు హెలిప్యాడ్ వద్దకు కూడా శివాజిని వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇంకా చాలామంది ఉన్నాకూడా ఒక్క శివాజీనే ఎందుకు అడ్డుకున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. తాజాగా మళ్ళీ కరకట్టపై అడ్డుకున్నారు. ఎంఎల్ఏ ఎంత చెప్పినా వినకుండా కరకట్టపైనుండి కాకుండా ఉండవల్లి మార్గంలో పంపేసారు.

click me!