ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నన్ను సంప్రదించారు.. టీడీపీ పెద్దలు ఫోన్ చేశారు.. కానీ.. : మద్దాలి గిరి

By Sumanth KanukulaFirst Published Mar 27, 2023, 3:47 PM IST
Highlights

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ తనను సంప్రదించిందని అన్నారు.

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ తనను సంప్రదించిందని అన్నారు. ఈ రోజు మద్దాలి  గిరి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు వారం రోజలు తమను సంప్రందించిన మాట నిజమని అన్నారు. స్వయంగా తనను కలిశారని చెప్పారు. తాను ఒప్పుకుంటే వాళ్లతో, వీళ్లతో మాట్లాడిస్తామని చెప్పారని తెలిపారు. స్వయంగా ఆ పార్టీలోని పెద్దలు తనకు ఫోన్ చేశారని.. అయితే తాను ఫోన్ కూడా ఎత్తలేదని అన్నారు. కావాలంటే తన కాల్ డేటా చూడాలంటూ మీడియాకు చూపించారు. పేపర్‌ను మీడియా ముందుపెట్టిన మద్దాలి గిరి.. ఈ నెంబర్ ఎవరిదో చూస్తే మీకే అర్థమవుతుందని అన్నారు. 

టీడీపీ సంప్రదించిన వారికి వత్తాసు పలికే పరిస్థితి లేదని చెప్పారు. తాను ఆ పార్టీకి దూరం జరిగి మూడు సంవత్సరాలు మూడు నెలల అయిందని.. డబ్బులకు అమ్ముడుపోయే నీచమైన రాజకీయాలు చేయలేదని చెప్పారు. తమ మీద నిందలు వేస్తున్నారనే తాను ఈ విషయాన్ని చెబుతున్నానని చెప్పారు. చంద్రబాబు అడ్డదారిలో ఎలా అధికారంలో వచ్చారనేది అందరికీ తెలుసునని అన్నారు. 

గౌరవం ఇవ్వకపోవడంతోనే టీడీపీని వీడామని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని విమర్శించారు. జగన్‌పై అభిమానంతోనే తాము వైసీపీలో చేరామని తెలిపారు. టీడీపీ పతనం కావడానికి లోకేషే కారణమని ఆరోపించారు. తాను తన వాళ్లు అనే  నైజం చంద్రబాబుది అని విమర్శించారు. అమరావతి ఉద్యమం కోసం శ్రీదేవి పోరాడతానని అనడం  హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పూటకొక మాట మారిస్తే ప్రజల విశ్వాసం కోల్పోతారని అన్నారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తమ ఎమ్మెల్యేలకు ప్రలోభాలకు గురిచేసిందని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే క్రాస్‌ ఓటింగ్ పాల్పడ్డారని ఆరోపిస్తూ నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం సప్పెండ్ చేసింది. చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను కొన్నారని వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఒక్కొక్కరికి రూ. 15 నుంచి రూ. 20 కోట్ల వరకూ డబ్బులు ఇచ్చారని ఆరోపణలు  చేశారు. 

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి బేరం తనకే వచ్చిందని.. టీడీపీ పది కోట్లు ఆఫర్ చేసిందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆరోపించారు. తన ఓటు అమ్మితే రూ.10 కోట్లు వచ్చేదని.. తన దగ్గర డబ్బు ఎక్కువై వద్దనలేదన్నారు. తన ఓటు కోసం తన మిత్రుడు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారని ఆరోపణలు చేశారు. అసెంబ్లీ దగ్గర కూడా ఓ రాజుగారు టీడీపీకి ఓటేయమన్నారని.. తెలుగుదేశానికి ఓటేస్తే మంచి పొజిషన్ వుంటుందని చెప్పారని రాపాక చెప్పుకొచ్చారు. 

సీఎం జగన్‌ను నమ్మాను కాబట్టే టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని.. సిగ్గు శరం వదిలేస్తే తనకు పదికోట్లు వచ్చి వుండేవని వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఒకసారి పరువు పోతే సమాజంలో వుండలేమని ఆయన పేర్కొన్నారు. అయితే తనపై  జనసేన ఎమ్మెల్యే  రాపాక  వరప్రసాద్  చేసిన ఆరోపణలపై  టీడీపీ ఎమ్మెల్యే  మంతెన రామరాజు స్పందించారు. రాపాక వరప్రసాద్ ఆరోపణలను మంతెన రామరాజు తోసిపుచ్చారు.
 

click me!