విశాఖ రాజధాని కోసం కరణం ధర్మశ్రీ రాజీనామా.. జేఏసీ కన్వీనర్‌కు లేఖ అందజేత.. రాజీనామా చేయాలని అచ్చెన్నకు సవాలు..

By Sumanth KanukulaFirst Published Oct 8, 2022, 12:34 PM IST
Highlights

అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, వైసీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే తాము రాజీనామాలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటనలు చేస్తున్నారు. 

వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న సమావేశాల్లో మంత్రులు, వైసీపీ నాయకులు పాల్గొంటున్నారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రాజధాని కోసం రాజీనామా చేయడానికి సిద్దమేనని ప్రకటనలు చేస్తున్నారు. శుక్రవారం గడప గడపకు మన  ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన మంత్రి ధర్మాన ప్రసాదరావు.. విశాఖకు రాజధాని రాకుండా చేసే వారిని శత్రువులుగా చూడాలని అన్నారు. సీఎం జగన్, ప్రజలు అనుమతిస్తే రాజీనామా చేసి ఉద్యమానికి వెళ్లిపోదామనే ఆలోచన ఉందని చెప్పారు. 

ఇదిలా ఉండగా.. వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామాలకు సిద్దమని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేడు ప్రకటించారు. వికేంద్రీకరణకు మద్దతుగా ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ అధ్యక్షతన వివాఖలోని హోటల్ మేఘాలయాలో శనివారం నాన్ పొలిటికల్ జేఏసీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, పలువురు ఫ్రొఫెసర్లు, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. 

Also Read: వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15న విశాఖలో భారీ ర్యాలీ.. భవిష్యత్తు కార్యచరణను ప్రకటించిన జేఏసీ..

ఈ సందర్భంగా రాజీనామాకు సిద్దంగా ఉన్నట్టుగా అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ ప్రకటించారు. కరణం ధర్మశ్రీ మరో అడుగు ముందుకు వేసి.. స్పీకర్ ఫార్మాట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా  కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా అమరావతి రైతులు వ్యతిరేకిస్తే.. తాము కూడా అమరావతికి వ్యతిరేకమేనని అన్నారు. వికేంద్రీకరణ కోసం తాను రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. దమ్ముంటే వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేయాలని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు సవాలు విసిరారు. అమరావతికి మద్దతు నినాదంతో టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని అన్నారు. అచ్చెన్నాయుడుపై పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా వెల్లడించారు. 

మరోవైపు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది సాధ్యమని చెప్పారు. అమరావతికి అన్యాయం చేస్తామని ఎక్కడ చెప్పలేదని తెలిపారు. ధర్మాన ప్రసాదరావు మాదిరిగానే.. తాను కూడా సీఎం జగన్ అనుమతిస్తే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని ప్రకటించారు. 

ఇదిలా ఉంటే.. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఉమ్మడి కార్యచరణ ప్రకటించింది. జేఏసీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టుగా తెలిపింది. ఈ నెల 15న విశాఖలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. వికేంద్రీకరణకు మద్దతుగా అంబేడ్కర్ సర్కిల్ నుంచి వేలాది మంది నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టుగా వెల్లడించింది. భారీ నిరసన ప్రదర్శనతో విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఆకాంక్షను బలంగా తెలియజేస్తామని పేర్కొంది. వికేంద్రీకరణపై ఉప్పెనలా ఉద్యమం చేపడతామని తెలిపింది. వికేంద్రీకరణకు మద్దతుగా త్వరలో మండల, నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపింది. ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్ర అడుగు పెట్టకముందే నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. ఇక, జేఏసీ తీసుకున్న నిర్ణయాలకు మద్దతు ఉంటుందని మంత్రులు, వైసీపీ నాయకులు ప్రకటించారు. 


 

click me!