
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామి (Tirumala Venkateshwara Swamy) సన్నిధిలో ఎమ్మెల్యే అనుచరుడినంటూ ఓ వ్యక్తి హల్ చల్ చేసాడు. స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన వ్యక్తి తాను ఎమ్మెల్యే అనుచరుడినని... కాబట్టి ముందుగా ఎలాంటి అనుమతి పొందకున్నా సకలసౌకర్యాలు కల్పించాలంటూ టిటిడి (TTD) అధికారులను కోరాడు. ఇందుకు టిటిడి అధికారులు నిరాకరించడంతో వారిపై దారుణంగా దాడికి తెగబడి గాయపర్చాడు.
తిరుమల కొండపై తనకు గదిని కేటాయించాలని ఎమ్మెల్యే అనుచరుడు టిడిపి అధికారులను దబాయించాడు. అయితే ముందుగా ఎలాంటి బుకింగ్ గానీ, ఎమ్మెల్యే సిపారసు గానీ లేకపోవడంతో గదిని కేటాయించేందుకు టిటిడి సీనియర్ అసిస్టెంట్ వెంకటరత్నం అంగీకరించలేదు. దీంతో ఆయనతో వాగ్వావాదానికి దిగి బెదిరించడమే కాదు ఒక్కసారిగా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఇలా ఎమ్మెల్యే అనుచరుడి దాడిలో టిటిడి ఉద్యోగి గాయపడ్డాడు.
ముఖంపై గాయాలవడంతో వెంకటరత్నం టిటిడి హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు టిటిడి ఉద్యోగిని కలిసి ఫిర్యాదు స్వీకరించారు. కేసు నమోదు చేసి ఎమ్మెల్యే అనుచరుడినంటూ దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలకు సిద్దమయ్యారు. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు.. అతడు ఏ ఎమ్మెల్యే అనుచరుడు అన్న విషయాన్ని ఇటు టిటిడి అధికారులు, అటు పోలీసులు కూడా బయటపెట్టడం లేదు.
నిత్యం స్వామివారి సేవలో వుండే టిటిడి ఉద్యోగిపై దాడిపై తోటి ఉద్యోగులే కాదు భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో వీఐపిలు, రాజకీయ నాయకులకు మరీ ప్రత్యేకంగా చూడటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. ఎమ్మెల్యే అనుచరుడినంటూ వీరంగం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, బిజెపి నాయకులు కోరుతున్నారు.
టిటిడి ఉద్యోగిపై దాడిని బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఖండించారు. స్వామివారం సన్నిధిలో ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. తిరుమలలో గది కావాలంటూ దబాయింపు చేసిన వ్యవహారంలో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నోరు మెదపాలన్నారు. అడ్డదారిలో గదిని కేటాయించాలని టిటిడి ఉద్యోగితో వాగ్వివాదం చేసిన వవ్యవహారాన్ని టిటిడి బోర్డు సీరియస్ గా తీసుకోవాలని వీర్రాజు సూచించారు.
టీటీడీ సీనియర్ అసిస్టెంట్ వెంకట రత్నం పై దాడి చేసిన ఘటనపై బోర్డు పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. తీవ్రగాయలతో పిర్యాదు చేసిన వెంకట రత్నం కు టిటిడి బోర్డు అండగా ఉండకపోతే బిజెపి జోక్యం చేసుకుంటుందని వీర్రాజు హెచ్చరించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వెంకటరత్నంకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇకపై తిరుమలలో రాజకీయ నాయకులు, వారి అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సోము వీర్రాజు టిటిడిని కోరారు.