
ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం చింతలపాలెం పరిధిలో బాలుడి మిస్సింగ్ ఘటన విషాదంతంగా ముగిసింది. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలుడు సాత్విక్ షాలోన్ (16 నెలలు) ఆదివారం సాయంత్రం విగతజీవిగా కనిపించాడు. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. చింతలపాలేంకు చెందిన మైలారి శామ్యూల్ తిరుపతిలో బేల్దారీ పనులు చేస్తుంటాడు. అతని భార్య కెజియా ఇంటి దగ్గర అత్తతో కలిసి ఉంటోంది. వీరికి సాత్విక్ అనే బాబు ఉన్నాడు. బుధవారం రాత్రి నానమ్మ పక్కలో పడుకున్న సాత్విక్ అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయాడు.
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. అయినప్పటికీ బాలుడి ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పంట పొలాల్లో కుళ్లిన స్థితిలో ఉన్న బాలుడి మృతదేహాన్ని గమనించి ఒక పశువుల కాపరి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం సాత్విక్‌దేనని నిర్దారించారు. సాత్విక్ మృతదేహాన్ని కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ట్రైనీ ఎస్పీ అంకితాసూరాన కూడా ఆదివారం రాత్రి బాలుడి మృతదేహం లభించిన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక పోలీసులను అడిగి వివరాలు తెలిపారు. అయితే బాలుడు మృతదేహం.. వారి ఇంటికి సమీపంని పంట పొలాల్లోనే పడి ఉండటం, మృతదేహాన్ని కప్పేందుకు పంట నూర్పిడి పొట్టును కప్పి ఉంచడం వంటి వాటిని పోలీసులు క్షుణంగా పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలుడి మృతదేహం లభించిన స్థితిని బట్టి చూస్తే.. కొట్టి చంపారా? లేదా గొంతు నులిమి చంపారా? అనేది తెలియడం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే పోస్టుమార్టమ్ రిపోర్టు తర్వాత ఈ కేసులో బాలుడిని ఎలా హత్య చేశారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.