
మచిలీపట్నం: వివాహితతో సహజీవనం చేస్తూ ఆమె కూతురిపైనా కన్నేసాడో కామాంధుడు. వివాహిత పనిపై బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా వుండే మైనర్ బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా తల్లి ప్రియుడి లైంగిక దాడితో గర్భందాల్చిన మైనర్ బాలిక తాజాగా బిడ్డకు జన్మనిచ్చింది. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మచిలీపట్నంలోని పెయింటర్స్ కాలనీకి చెందిన కోమటిరెడ్డి సురేష్ రెడ్డి(35) ట్యాక్సీ డ్రైవర్. కట్టుకున్న పెళ్లాం వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లడంతో అతడు ఒంటరిగా వుంటున్నాడు. ఈ క్రమంలో ఇలాగే భర్తకు దూరంగా ఇద్దరు బిడ్డలతో కలిసి జీవిస్తున్న వివాహితతో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరి మద్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసివంది. కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ కలిసే వుంటూ సమజీవనం ప్రారంభించారు.
వివాహితతో పాటు ఆమె 17ఏళ్ళ మైనర్ కూతురు, కుమారుడు కూడా సురేష్ తో కలిసి ఒకే ఇంట్లో వుంటున్నారు. ఈ క్రమంలోనే బాలికపై కూడా సురేష్ కన్నేసాడు. వివాహిత పనిపై బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా వుండే బాలికకు మాయమాటలు చెప్పి సురేష్ లోబర్చుకున్నారు. ఇలా కొంతకాలంగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది.
తాను సహజీవనం చేస్తున్న వ్యక్తి ద్వారా కూతురు గర్భందాల్చినట్లు బయట తెలిస్తే పరువు పోతుందని వివాహిత భావించింది. దీంతో గుట్టుగా కూతురికి అబార్షన్ చేయించాలని ప్రయత్నించింది. కానీ అది సాధ్యంకాకపోవడంతో బాలి మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో గత శుక్రవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది.
కూతురిని తల్లిని చేసి ముఖం చాటేసిన సురేష్ రెడ్డిపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేసారు. అతడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు బందరు డీఎస్పీ మాసూం బాషా వెల్లడించారు.
తల్లితో సహజీవనం చేస్తూ ఆమె మైనర్ కూతురుని తల్లిని చేసిన దుర్మార్గున్ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, మచిలీపట్నం ప్రజలు పోలీసులను కోరుతున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకుని న్యాయం చేయాలని ప్రతిపక్ష టిడిపి నాయకులు కోరుతున్నారు.
ఇదిలావుంటే ఏపీలో వరుసగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు వెలుగుచూస్తున్నాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం, తుమ్మపూడిలో వివాహిత దారుణ హత్య, శృంగారపురంలో మహిళపై యువకుల అత్యాచారయత్నం ఘటనలు వెలుగుచూసాయి.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని శృంగారపురం గ్రామానికి ఇతర ప్రాంతాల నుండి కూలీపనుల కోసం వచ్చిన ఓ మహిళ ఆలయంలో నిద్రిస్తుండగా కొందరు యువకులు అఘాయిత్యానికి యత్నించారు. నిద్రిస్తున్న మహిళను దగ్గర్లోని తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా అరిచింది. దీంతో భయపడిపోయిన యువకులు పరారయ్యారు. యువతి కుటుంబసభ్యుల పిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేసారు.
ఇక తుమ్మపూడిలో వివాహిత హత్య సంచలనం సృష్టించింది. మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు ప్రచారం జరగ్గా గుంటూరు ఎస్పీ సంచలన విషయాలు బయటపెట్టాడు. మహిళపై అత్యాచారం జరగలేదని... ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యగా గుంటూరు అర్భన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.