
జగన్ పాదయాత్ర ఒక భూటకమని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేయడం లేదని మంత్రి సుజయ కృష్ణ రంగారావు ఎద్దేవా చేసారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం పాతరేగ గ్రామంలో మంత్రి బుధవారం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, కేవలం రాజాకీయ లబ్ధి కోసమే జగన్ నేగిటివ్ మైండ్ సెట్ తో పాదయాత్ర మొదలుపెట్టినట్లు ఆరోపించారు. అందుకే జగన్ ను నమ్మే పరిస్ధితిలో రాష్ట్ర ప్రజలు లేరని చెప్పారు. ప్రతిపక్షం పూర్తిగా తన బాధ్యతను విస్మరించిందన్నారు. శాసనసభలో ప్రజాసమస్యలు ప్రస్తావించి ప్రజల పక్షాన నిల్వవాల్సిన వైసీపీ, సమావేశాలను బహిష్కరించడం ఘాతుకమైన చర్యగా మంత్రి అభివర్ణించారు.
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలన్న జగన్ నిర్ణయాన్ని స్వంత పార్టీ ఏమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి తెలిపారు. శాసనసభ సమావేశాలు బహిష్కరణకు జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతుందన్నారు. శాసనసభ సమావేసాలలో ప్రతిపక్షం లేకపోయిన ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రజలు చెబుతున్న సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.