అమరావతికి మంచిరోజులు... 15 రోజుల్లో రాజధానిలో ఏం చేయబోతున్నారంటే..?

Published : Jun 16, 2024, 05:09 PM IST
అమరావతికి మంచిరోజులు... 15 రోజుల్లో రాజధానిలో ఏం చేయబోతున్నారంటే..?

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మంచిరోజులు మొదలయ్యాయి. ఇక్కడ అభివృద్ది పనులు ఇక పరుగులు పెట్టనుంది. రానున్న 15 రోజుల్లో అమరావతికి  అభివృద్దికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు వెల్లడించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అబివృద్ధి పనులను రానున్న రెండున్నర్రేళ్లలో పూర్తిచేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన ఛాంబర్ లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన నారాయణ... అమరావతిని ప్రపంచంలోనే తొలి ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అత్యుత్తమమైన డిజైన్‌ను రూపొందించి అమలు చేశామని తెలిపారు. రాజధానిలో చేపట్టే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమమైనా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సింగపూర్ ప్రభుత్వం సహాయంతో అత్యుత్తమమైన డిజైన్‌ను రూపొందించి అమలు పర్చామన్నారు. రాష్ట్ర రాజధానికి సంబంధించి అత్యుత్తమైన డిజైన్‌ను రూపొందించేందుకు సింగపూర్, చైనా, జపాన్, రష్యా, మలేసియా తదితర దేశాలను కూడా సందర్శించామని గుర్తుచేశారు. రాజధానిలో మెజారిటీ ప్రాంతం కవర్ అయ్యేలా మౌలిక వసతుల కల్పనతోపాటు మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగుల నివాసానికి సంబంధించి భవనాల నిర్మాణానికి తొలిదశలో పనులను చేపట్టేందుకు గతంలో రూ.48వేల కోట్లతో పనులను ప్రారంభించామని వెల్లడించారు. దాదాపు 90శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. 

రాజధాని నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో భాగంగా 2015 జనవరి 1 న ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చి... 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికల్లా ఎలాంటి వివాదాలు లేకుండా 34వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి అందజేశారని మంత్రి నారాయణ గుర్తుచేశారు. అలాంటి రాజధాని అభివృద్ది విషయంలో గత ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. రాజధాని నిర్మాణానికి గతంలో ఎంతో అధ్యయనం చేసి మంచి అనుభవాన్ని సాధించానని తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా తనకు బాధ్యతలు అప్పగించారన్నారు. ఇకపై నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహించి రానున్న 15రోజుల్లో అమరావతిలో ఏ సమయంలోపు ఏది పూర్తి చేస్తామన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఇక, అమరావతి రాజధాని అభివృద్దికి తొలిదశలో రూ.48వేల కోట్లు అవుతాయని అంచనా వేశామని... ఈ దశలో సిటీ నిర్మాణ పనులు పూర్తి అవుతాయని తెలిపారు. రెండో దశలో మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu