ప్యాకేజ్ తీసుకునే అన్‌స్టాపబుల్ షోకి.. అది యువగళం కాదు నారాగళం : పవన్ , లోకేష్‌లపై రోజా సెటైర్లు

By Siva KodatiFirst Published Dec 28, 2022, 8:18 PM IST
Highlights

టీడీపీ నేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టడం, లోకేష్ పాదయాత్ర రెండూ ఒక్కటేనన్న ఆమె... జనసేన కార్యకర్తలతో పవన్ బీజేపీ, టీడీపీ జెండాలు మోయిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. 

టీడీపీ నేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. యువగళం.. నారా గళమా అంటూ ఆమె వ్యాఖ్యానించారు. నారా లోకేష్ దొంగదారిలో మంత్రి అయ్యారని.. పాదయాత్ర చేసి లోకేష్ ఏం సాధిస్తాడని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌లు ఏపీని అప్పులపాలు చేశారని ఆమె ఎద్దేవా చేశారు. బాదుడే బాదుడు , ఇదేం ఖర్మ కార్యక్రమాలు ఫ్లాప్ అయ్యాయని రోజా వ్యాఖ్యానించారు. కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టడం, లోకేష్ పాదయాత్ర రెండూ ఒక్కటేనని ఆమె సెటైర్లు వేశారు. 

కరోనా సమయంలో పొరుగు రాష్ట్రంలో దాక్కున్నవారు ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని పాదయాత్ర చేస్తారని రోజా నిలదీశారు. టీడీపీకి ప్రతిపక్ష అర్హత కూడా లేదని ఆమె ఎద్దేవా చేశారు. గతంలో ఎప్పుడూ ఏ షోకి వెళ్లని పవన్ కల్యాణ్ అన్‌స్టాపబుల్‌కి వెళ్లాడని... ఇందుకోసం చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నారని రోజా ఆరోపించారు. పవన్ ప్యాకేజ్ కోసం ఎంతకైనా దిగజారుతారని.. జనసేన కార్యకర్తలతో బీజేపీ, తెలుగుదేశం జెండాలు మోయిస్తున్నారని ఆమె  దుయ్యబట్టారు. ఇక.. పెన్షన్ల తొలగింపుపైనా మంత్రి స్పందించారు. తెలుగుదేశం హయాంలో 30 లక్షల మందికి పింఛన్లు ఇస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక 62 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందజేశామని ఆమె తెలిపారు. 

Also REad: పెన్షన్ పెంచి.. లబ్ధిదారులను తగ్గిస్తారా, రూ.3 వేల పింఛన్ హామీ ఇలాగేనా : జగన్‌కు పవన్ బహిరంగ లేఖ

ఇదిలావుండగా.. నారా లోకేష్  వచ్చే ఏడాది జనవరి  27వ తేదీ నుండి  రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించనున్నారు.  400 రోజుల పాటు  ఈ పాదయాత్ర సాగనుంది. 4 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర సాగేలా  లోకేష్ రూట్ మ్యాప్ ను సిద్దం చేసుకుంటున్నారు. ఈ పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టారు. 2024 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  అధికారంలోకి రావాలని  టీడీపీ పట్టుదలతో ఉంది.  దీంతో  లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.  

వచ్చే ఏడాది జనవరి  27వ తేదీన  కుప్పం అసెంబ్లీ  నియోజకవర్గం నుండి  లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.  2014కు ముందు చంద్రబాబునాయుడు  హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో  పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్ మాత్రం తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుండి పాదయాత్రకు  శ్రీకారం చుట్టనున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో  కూడా  లోకేష్ పాదయాత్ర  నాలుగు రోజుల పాటు  సాగనుంది.  

click me!