తిరుమల కొండపై మంత్రి రోజా హల్‌ చల్: అనుచరులకు దర్శనం అయ్యేవరకు ఆలయంలోనే..!

By Sumanth KanukulaFirst Published Aug 18, 2022, 10:55 AM IST
Highlights

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్‌, వరుస సెలవులతో శ్రీవారం దర్శనానికి భక్తులు పోటెత్తారు.  ఈ నేపథ్యంలోనే ఆగస్టు 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఇటీవల ప్రకటించింది. అయితే ఇవేమి పట్టించుకోకుండా కొందరు వీఐపీలు తిరుమలకు క్యూ కడుతున్నారు. టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమవారికి దర్శనం చేయించుకుంటున్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్‌, వరుస సెలవులతో శ్రీవారం దర్శనానికి భక్తులు పోటెత్తారు.  ఈ నేపథ్యంలోనే ఆగస్టు 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఇటీవల ప్రకటించింది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనూహ్యంగా రద్దీ పెరిగిందని.. భక్తులు అప్పుడే తొందరపడి తిరుమల రావొద్దని కూడా సూచించారు. అయితే ఇవేమి పట్టించుకోకుండా కొందరు వీఐపీలు తిరుమలకు క్యూ కడుతున్నారు. టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమవారికి దర్శనం చేయించుకుంటున్నారు. ఈ నెల 15న మంత్రి ఉషాశ్రీ చరణ్ తన అనుచరులతో కలిసి బ్రేక్ దర్శనం చేసుకున్నారు. భక్తుల కష్టాలపై ప్రశ్నించిన మీడియాపై మంత్రి గన్‌మెన్లు దురుసుగా ప్రవర్తించారు. ఓ వీడియో జర్నలిస్టును నెట్టేశారు.

తాజాగా మంత్రి రోజా కూడా తిరుమల కొండపై తమవారిని బ్రేక్ దర్శనం ఇప్పించారు. మంత్రి రోజా ఒత్తిడితో 10 మందికి ప్రోటోకాల్ దర్శనం.. మరో 20 మందికి సాధారణ బ్రేక్ దర్శనం ఇప్పించినట్టుగా ఎన్టీవీ న్యూస్ చానల్ పేర్కొంది. మంత్రి రోజా దగ్గరుండి తమవారికి దర్శనాలు చేయించుకున్నారు. అనుచరులందరికీ దర్శనం అయ్యేవరకు రోజా 2 గంటల పాటు ఆలయంలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బ్రేక్ దర్శనం రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకోగా.. మంత్రుల ఒత్తిడితో అధికారులు రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుందనే విమర్శ వినిపిస్తుంది. ఈ పరిణామాలపై శ్రీవారి భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే రోజా మాత్రం తమవారు జనరల్ దర్శనం చేసుకనున్నారని తెలిపారు. ‘‘టీటీడీ నిర్ణయాన్ని గౌరవించాలి కదా.. బ్రేక్ దర్శనం 21 వరకు అందరికి ఇవ్వడానికి లేదు అన్నారు.. మా నగిరి నియోజకవర్గ లీడర్లు వచ్చారు.. జనరల్‌లో దర్శనం చేసుకుని వెళ్తున్నాం’’ అని మంత్రి రోజా తెలిపారు. 

ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. ఇక, బుధవారం శ్రీవారిని 83,880 మంది భక్తులు దర్శించుకున్నారు. 
 

click me!