పీఆర్సీ వివాదం.. ఉద్యోగులు చర్చలకు వచ్చే వరకు వెయిట్ చేస్తాం: తేల్చిచెప్పిన పేర్ని నాని

Siva Kodati |  
Published : Jan 27, 2022, 06:24 PM IST
పీఆర్సీ వివాదం.. ఉద్యోగులు చర్చలకు వచ్చే వరకు వెయిట్ చేస్తాం: తేల్చిచెప్పిన పేర్ని నాని

సారాంశం

పీఆర్సీపై ఉద్యోగులు చర్చలకు వచ్చే వరకు వేచి చూస్తామన్నారు ఏపీ మంత్రి పేర్ని నాని (perni nani). ఉద్యోగులు కోరినట్లే ప్రభుత్వం సంప్రదింపుల కమిటీ వేసిందని ఆయన గుర్తుచేశారు. జీవో జారీ చేసి, అధికారికంగా చర్చలకు పిలిచిందని పేర్ని నాని తెలిపారు. 

పీఆర్సీపై ఉద్యోగులు చర్చలకు వచ్చే వరకు వేచి చూస్తామన్నారు ఏపీ మంత్రి పేర్ని నాని (perni nani). ఉద్యోగులు కోరినట్లే ప్రభుత్వం సంప్రదింపుల కమిటీ వేసిందని ఆయన గుర్తుచేశారు. జీవో జారీ చేసి, అధికారికంగా చర్చలకు పిలిచిందని పేర్ని నాని తెలిపారు. రిపబ్లిక్ డే తర్వాత చర్చలకు రావాలని.. ప్రతినిధి బృందానికి కూడా చెప్పి పంపామని మంత్రి చెప్పారు. 

అంతకుముందు పీఆర్సీ (prc) వ్యవహారానికి సంబంధించి ఏపీ సచివాలయంలో పీఆర్సీ సాధన సమితి సమావేశం  ముగిసింది. జీతాలు ప్రాసెస్ చేయకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై ఉద్యోగ నేతలు చర్చలు జరిపారు. అనంతరం సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) మీడియాతో  మాట్లాడుతూ... మొన్న లేఖ ఇచ్చి గంటన్నరపాటు చర్చించి వచ్చారని అన్నారు. చర్చలు మాకు ఇష్టం లేదన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడటం సరికాదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 

మమ్మల్నే తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తమ డిమాండ్లు ఏంటో ఇప్పటికే చెప్పామన్నారు. ప్రభుత్వానికి తమ ప్రతినిధుల బృందం ఇప్పటికే నివేదించిందని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. పాత జీతాలే ఇవ్వాలని తాము కోరుతున్నామన్నారు. అప్పుడే  ప్రభుత్వంపై తమకు నమ్మకం కలుగుతుందని... 3 డిమాండ్లు పరిష్కరించిన తర్వాతే చర్చలకు వస్తామని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 

మరోవైపు ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) సూచించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. పరిస్థితి చేజారిపోక ముందే ఉద్యోగ సంఘాల నేతలు ఈ అంశాన్ని ముగించేందుకు సహకరించాలని రామకృష్ణారెడ్డి కోరారు. చర్చలకు రమ్మని తామే కోరుతున్నామని సజ్జల తెలిపారు. 

అయినా చర్చలకు రాకుండా మొండికి వేయడం తగదని హితవు పలికారు. చర్చలకు వస్తేనే కదా? కమిటీలో చర్చిస్తేనే కదా? అసలు సమస్య ఏంటో తెలిసేది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ కమిటీ పరిధిలో లేని అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ప్రభుత్వం నాలుగు మెట్లు దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా ఉద్యోగ సంఘాల నేతలు మొండికేయడం తగదని రామకృష్ణారెడ్డి అన్నారు. తాము చర్చల కోసం ప్రతి రోజూ సచివాలయంలో వేచి చూస్తూనే ఉంటామన్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్