నిరుద్యోగులకు శుభవార్త... సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ ఆదేశం

Arun Kumar P   | Asianet News
Published : Jan 27, 2022, 05:15 PM ISTUpdated : Jan 27, 2022, 05:17 PM IST
నిరుద్యోగులకు శుభవార్త... సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ ఆదేశం

సారాంశం

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. 

అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఇక ఇదివరకే ప్రకటించినట్లు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ కూడా తొందరగా పూర్తిచేయాని సీఎం జగన్ ఆదేశించారు. 

సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ (citizen services portal) ప్రారంభించిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంప్ కార్యాలయంలోనే సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఉగాది పండగ (ugadi festival) సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న వాలంటీర్ల (volunteers)ను సత్కరించి, వారికి ప్రోత్సాహకాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టిపెట్టాలన్న సీఎం అధికారులకు సూచించారు. అలాగే ఉగాది నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరికీ కూడా యూనిఫామ్స్‌ ఇవ్వాలని  సీఎం ఆదేశించారు. 

''ఈ ఏడాది మే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిగా ఆధార్‌ సేవలు (aadhar service) అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోండి. ఇప్పటినుండే ఆధార్‌ సేవలను అందించడానికి అవసరమైన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయండి'' అని సూచించారు.  

''సచివాలయాల్లో ఉపయోగించే హార్డ్‌ వేర్‌ ఎప్పటికప్పుడు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతినెలకోసారి గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు, పరికరాల స్థితిగతులపై నివేదికలు తెప్పించుకుని ఆమేరకు అవి సక్రమంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి'' అని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. 

''ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఉత్తమ పనితీరు కనబరచాలి. సిబ్బంది మంచి సమర్థత కనబరచాలి. ప్రజలకు వారు అందించాల్సిన సేవల విషయంలో అనుసరించాల్సిన తీరుపై నిరంతరం అవగాహన కల్పించాలి. నిర్దేశించిన ఎస్‌ఓపీలను తప్పనిసరిగా అమలు చేయాలి.  ప్రజలకు అందుబాటులో ఉండడం అన్నది అత్యంత ప్రాధాన్యతా అంశం'' అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

''సేవలకోసం ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా తగిన వ్యవస్థ ఉండాలి. దీనిపై తీసుకున్న చర్యలను కూడా సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ లో పొందుపరచాలి. పోర్టల్‌లో ఈమేరకు మార్పులు చేర్పులు చేయాలి'' అని సీఎం సూచించారు. 

''సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ (citizen out reach) కార్యక్రమం చాలా ముఖ్యమైనది. సమర్థవంతగా ఈ కార్యక్రమం కొనసాగాలి. దీనివల్ల ప్రజల నుంచి సమస్యలు, సూచనలు అందుతాయి. ప్రజలకు కూడా మరింత అందుబాటులో ఉన్నామని మనం తెలియజేయడానికి ఒక అవకాశం లభిస్తుంది'' అన్నారు. 

''సచివాలయాల సిబ్బంది మధ్య, ప్రభుత్వ విభాగాలమధ్య నిరంతరం సమన్వయం ఉండాలి. దీనికోసం గ్రామ, వార్డు స్థాయిలో, మండల స్థాయిలో, రెవిన్యూ డివిజన్‌ స్థాయిలో, జిల్లాల స్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచన చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను మారుతున్న పరిస్థితులకు, సాంకేతికతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి'' అని సీఎం జగన్ ఆదేశించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu