జగనన్న కాలనీలకే అధిక ప్రాధాన్యం...: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

By Arun Kumar PFirst Published Jun 15, 2021, 3:06 PM IST
Highlights

తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజనీరింగ్ అధికారులతో జల్‌జీవన్ మిషన్‌పై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను మంగళవారం మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు.  

అమరావతి: రాష్ట్రంలో 2024 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజనీరింగ్ అధికారులతో జల్‌జీవన్ మిషన్‌పై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యుస్‌ టెక్నికల్ హ్యాండ్ బుక్‌ను ఆయన ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ... గత ఏడాది నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 47శాతం గృహాలకు ఇంటింటి కుళాయి కనెక్షన్ ఇవ్వగలిగామన్నారు. ఇదే స్పూర్తితో రానున్న రెండేళ్ళలో అనుకున్న లక్ష్యాల మేరకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది జల్‌జీవన్ మిషన్ ద్వారా రూ.7251 కోట్ల రూపాయల నిధులతో పనులను చేపట్టాల్సి ఉందని... ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులపై ఉందని అన్నారు. 

కేంద్రం ద్వారా వస్తున్న నిధులు, రాష్ట్రప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ గ్రిడ్ ప్రణాళిక ప్రకారం పనులను ముమ్మరం చేయాలని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 83 శాతం ఇంటింటి కుళాయి కనెక్షన్‌లు ఇవ్వాలనేది లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని... ఆ మేరకు అధికారులు సకాలంలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ ఏడాది విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు 2023 మార్చి నాటికి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణ, అనంతపురం, కర్నూలు, 2024 మార్చి నాటికి శ్రీకాకుళం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్‌లు అందించాలనే ప్రణాళికతో ప్రభుత్వం ముందకు పోతోందని వెల్లడించారు. 

read more  మంత్రి మేకపాటి డిల్లీకి పయనం... కేంద్ర మంత్రి ధర్మేంద్రతో కీలక సమావేశం

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 30లక్షలకు పైగా పేదలకు పట్టాలు ఇవ్వడం, తొలిదశలో ఏకంగా15 లక్షలకు పైగా పక్కా గృహాల నిర్మాణంకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు పక్కాగృహాల నిర్మాణంకు అవసరమైన నీటి వనతిని కల్పించాల్సిన బాధ్యత ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులదేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 వేల జగనన్న కాలనీల లేఅవుట్లు ఉన్నాయని, వాటిలో ఇప్పటి వరకు 3772 లేఅవుట్స్‌కు నీటి సదుపాయం కల్పించారని అన్నారు. మిగిలిన లేఅవుట్స్‌కు కూడా తక్షణం నీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో గృహనిర్మాణ పనులు వేగవంతం అవుతున్న నేపథ్యంలో  పేదల కాలనీలకు నీటి సదుపాయం ఉండేనే నిర్మాణం సాధ్యమవుతుందని, దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. జగనన్న కాలనీల్లో నీటి సదుపాయం కోసం చేసే పనులకు బిల్లుల చెల్లింపుల్లో ఎటువంటి జాప్యం ఉండదని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు పనులను ముమ్మరం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి కోరారు.
 

click me!