
జగన్ రెడ్డి కేబినెట్ లో పని చేసిన మంత్రి పెద్దిరెడ్డి మూడేళ్లలో రూ.6,889కోట్ల ప్రజల సొమ్ముని కొల్లగొట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. దాదాపు నిన్నటి వరకు ఉన్న మంత్రులందరూ అవినీతి పరులే అని వారిపై సీబీఐ విచారణ జరిపిస్తే వారంతా జైళ్ల ఉంటారని చెప్పారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ మూడేళ్లలో రాష్ట్రంలో అంతులేని అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. మంత్రులు చేస్తున్న అవినతీని టీడీపీ అనేకసార్లు ఆధారాలతో సహా బయటపెట్టినా కూడా జగన్ రెడ్డి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. మంత్రులుగా పనిచేసి, రాజీనామాలు చేసిన 24 మంది అవినీతి బాగోతానికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు తమవద్ద ఉన్నాయని అన్నారు.
నిన్నటి వరకు జగన్ రెడ్డి కేబినెట్ లో ఉన్న వారిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కువగా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. అంతులేని సంపదను పోగుచేసిన కేబినెట్ మంత్రుల్లో తొలిస్థానం ఆయనకే దక్కుతుందని అన్నారు. ఇప్పటి వరకు ఆయన రూ.6,889 కోట్ల వరకు సంపాదించారని ఆరోపించారు. పెద్దిరెడ్డికి శివశక్తి డెయిరీ ఉందని, దానికి పాలు పోసే పేద, మధ్య తరగతి మహిళలను బెదిరించి రూ.18 కి ఒక లీటర్ పాలు కొంటున్నారని, దీని వల్ల ఆయన ఇప్పటి వరకు రూ.700 కోట్ల వరకు సంపాదించారని అన్నారు.
చిత్తూరులో పల్ప్ ఫ్యాక్టరీ ఉందని, దాని కోసం రైతులను బెదిరించి తక్కువ ధరకు మామిడి కాయలను కొని లాభం పొందుతున్నారని తెలిపారు. ఇలా ఇప్పటి వరకు రైతుల జేబుల కొల్లగట్టి రూ.190 కోట్లు సంపాదించారని ఆరోపించారు. భూమాఫియాలో కూడా పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలోనే కింగ్ గా నిలిచారని తీవ్రంగా ఆరోపించారు. తిరుపతి, మదనపల్లి, తంబళ్లపల్లి, నగరి ప్రాంతాల్లో 800 ఎకరాలకు పైగా భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వీటి విలువ రూ.810 కోట్ల వరకు ఉంటుందని అన్నారు.
తిరుపతి హథీరాంజీ మఠానికి చెందిన రూ.60 కోట్ల విలువైన 3 ఎకరాలను కూడా పెద్దిరెడ్డి కబ్జా చేశారని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. ఆఖరికి డీకేటీ పట్టా భూముల్నికూడా ఆయన వదిలిపెట్టలేదని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరులోని కల్లూరులో ఉన్న రూ.870 కోట్ల విలువ చేసే 88 ఎకరాల డీకేటీ భూమిని స్వాహా చేశారని అన్నారు. ఆయన బినామీలతో తంబళ్లపల్లిలోనే రూ.420 కోట్ల విలువ చేసే 300 ఎకరాలను మూడోకంటికి తెలియకుండా మింగేశారని ఆరోపించారు. పేదలకు ఇచ్చే సెంటు పట్టా భూముల్నికూడా వదలేదని అన్నారు.
ఇసుక మాఫియాలోనూ పెద్దిరెడ్డి తన చక్రం తిప్పారని టీడీపీ నేత ఉమా మహేశ్వరరావు అన్నారు. తంబళ్లపల్లి కేంద్రంగా పెద్దిరెడ్డి రూ.130 కోట్ల వరకు ఇసుక అమ్మకాలు జరిపారని అన్నారు. అలానే చిత్తూరు కేంద్రంగా రూ.70 కోట్లు, పీలేరు కేంద్రంగా రూ.62 కోట్లను ఇసుక కుంభకోణంలో కొల్లగొట్టారని ఆరోపించారు. మైనింగ్ మాఫియా కోసం పీలేరులో రూ.415 కోట్ల విలువైన 230 ఎకరాలను, మదనపల్లిలో రూ.170కోట్ల ఖరీదుచేసే 70 ఎకరాలను, తంబళ్ల పల్లిలో రూ.82 కోట్ల విలువైన 192 ఎకరాలను ఆక్రమించారని అన్నారు.
మద్యం మాఫియాలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన పెద్దిరెడ్డి దాని ద్వారా రూ.375 కోట్ల వరకు పోగేసుకున్నారని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. నాసిరకం జేబ్రాండ్ మద్యం నాటుసారాను తన నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా అమ్మకాలు సాగించారని అన్నారు. జేబ్రాండ్ మద్యాన్ని డిస్టిలరీల నుంచి కొనుగోలు చేసే క్రమంలో రూ.340 కోట్లు, మద్యం ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్ట్ పేరుతో రూ.35 కోట్లు తన ఖజానాలో వేసుకున్నాడని ఆరోపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ తో కూడా పెద్దిరెడ్డి అవినీతి ఖండాం తరాలు దాటి పోయిందని అన్నారు. టీడీపీ హాయాంలో ఎర్ర చందనం దుంగ పట్టుకోవాలంటేనే వణికిపోయేవారని, కానీ జగన్ జమానాలో శేషాచలం అడవే మాయమైందని అన్నారు. ఇప్పటి వరకు రూ.1800 కోట్ల విలువైన ఎర్ర చందనాన్ని పెద్దిరెడ్డి విదేశాలకు తరలించారని ఆరోపించారు.
సీఎం జగన్ కు తెలియకుండానే పెద్దిరెడ్డి ఇన్నివేల కోట్లు పోగేశారా అని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. ఈ దోపిడీపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ విడుదల చేసిన ఈ వివరాలతో తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. సీఎం జగన్ కు రాజీనామాలు అందించిన మంత్రులందరి అవినీతి, దోపిడీపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తాన్నామని అన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో సీబీఐ విచారణకు ఆదేశిస్తే మంత్రులందరూ జైళ్లో ఉంటారని ఆయన అన్నారు.