ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్.. రంగంలోకి మంత్రి పెద్దిరెడ్డి..!

By Sumanth KanukulaFirst Published Dec 15, 2022, 12:06 PM IST
Highlights

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్‌పై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే  వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. 

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్‌పై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతల మధ్య విబేధాలను గమనించి వైసీపీ అధిష్టానం.. వాటికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే  వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారలపై సమీక్ష నిర్వహిస్తున్న క్రమంలో.. ఈ విబేధాలు తెరపైకి వచ్చాయి. ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాలపై సమీక్ష సందర్భంగా.. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేక వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర రెడ్డి, ఆయన తమ్ముడు వై మధుసూధన్‌రెడ్డిలు మధ్య విభేదాలు బయటపడ్డాయి. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలోనే ఇరువురు వారి వారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జోక్యం చేసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వారికి సర్దిచెప్పారు. మరోవైపు ఎమ్మెల్సీ యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి కుమారుడు కూడా వచ్చే ఎన్నికల్లో ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ క్రమంలోనే గ్రూప్ పాలిటిక్స్‌పై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఇలాంటి వాటిని సహించేది లేదని స్పస్టం చేశారు. నాయకులపై అసమ్మతి లేని నియోజకవర్గం ఎక్కడ ఉండదని.. అన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకని ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ పాటించని నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ఇదిలా ఉంటే.. నేటి నుంచి శ్రీ సత్యసాయి జిల్లాలో పార్టీ పరిస్థితిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రోజు ఆయన హిందూపురం, మడకశిర నియోజవర్గం నేతలతో సమావేశం కానున్నారు. హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్ నిశ్చల్, చౌలురు రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. అయితే పెద్దిరెడ్డి నిర్వహించే సమీక్ష సందర్భంగా వీరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారనేది పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎమ్మెల్యే తిప్పేస్వామిపై పార్టీలోని సొంత సామాజిక వర్గం నుంచే అసమ్మతి వ్యక్తం అవుతుంది.  

ఇక, డిసెంబర్‌ 17న పెనుకొండ, ధర్మవరంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఎత్తున సభలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 18న మంత్రి పుట్టపర్తి, కదిరిలో పర్యటించనున్నారు. ఈ సమీక్షల అనంతరం ఉమ్మడి జిల్లాలో వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్‌‌కు చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలాంటి వ్యుహాలతో ముందుకు వెళ్తారనేది వేచి చూడాల్సి ఉంది.  

click me!