కర్నూల్‌లో ఏటీఎం చోరీకి దొంగల ముఠా యత్నం: పారిపోతూ పోలీసులపైకి కాల్పులు

By narsimha lodeFirst Published Dec 15, 2022, 10:23 AM IST
Highlights

కర్నూల్ జిల్లాలో  హర్యానా దొంగల ముఠాలో  ఇద్దరిని  పోలీసులు  అరెస్ట్  చేశారు. మరో నలుగురు పారిపోయారు. పారిపోయే సమయంలో  దొంగలు  పోలీసులపై కాల్పులకు దిగారు.   పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


 కర్నూల్: కర్నూల్  జిల్లాలో  హర్యానా దొంగల ముఠాలో  ఇద్దరిని పోలీసులు గురువారం నాడు  అరెస్ట్  చేశారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంలను పట్టుకొనేందుకు  ప్రయత్నించిన  పోలీసులపై దొంగలు మూడు రౌండ్ల కాల్పులకు దిగారు. కర్నూల్ పట్టణంలోని బాలాజీ నగర్ లో  గల ఎస్‌బీఐ ఎటీఎంను ధ్వంసం చేసేందుకు  ప్రయత్నించారు.  గ్యాస్ సిలిండర్, కట్టర్లు, స్ప్రేయర్లతో  ఏటీఎంను తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు.  అయితే అదే సమయంలో    పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ  అక్కడికి చేరుకున్నారు.  పోలీసులను గుర్తించిన  దొంగలు  గ్యాస్ సిలిండర్, కట్టర్లు, స్ప్రేయర్, స్పానర్లను  అక్కడే వదిలి పారిపోయారు.ఈ క్రమంలో  ఇద్దరిని పెట్రోలింగ్  పోలీసులు  పట్టుకున్నారు. మరో నలుగురు పారిపోయారు. పారిపోతున్న దొంగలను  పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నించారు.ఈ సమయంలో దొంగలు  పోలీసులపై మూడు రౌండ్లు  కాల్పులకు దిగారు.   

బాలాజీనగర్  ఎస్‌బీఐ ఏటీఎంకు సమీపంలోనే  తాము తెచ్చుకున్న లారీని దొంగలు పార్క్ చేశారు.  ఏటీఎంను మెషీన్ ను  లారీలో తీసుకెళ్లాలని  దొంగలు భావించారు.  ఏటీఎం మెషీన్ ను ధ్వంసం చేసే సమయంలోనే పోలీసులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులను చూసి  దొంగలు పారిపోయారు.లారీలో డోన్ వైపునకు దొంగలు పారిపోయినట్టుగా  పోలీసులు చెబుతున్నారు.హర్యానా రాష్ట్రానికి చెందిన  దొంగల ముఠాలో  ముస్తపా, తాహేర్  లను పోలీసులు  అరెస్ట్  చేశారు.  అరెస్టైన  ఇద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పారిపోయిన నిందితుల కోసం పోలీసుులు గాలిస్తున్నారు. 
 

click me!