గంటా శ్రీనివాసరావు నివాసంలో కాపు నేతల భేటీ: రాష్ట్ర రాజకీయాలపై చర్చ

By narsimha lodeFirst Published Dec 15, 2022, 9:43 AM IST
Highlights

ఏపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో  కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు  నిన్న రాత్రి విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  రాజకీయ  పరిస్థితులపై చర్చించారు.


విజయవాడ: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసంలో  పలు పార్టీలకు చెందిన  కాపు నేతలు బుధవారం నాడు రాత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో   రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్న విజయవాడకు  వచ్చారు. వివాహ కార్యక్రమానికి హాజరైన పలు పార్టీల కాపు నేతలు  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసం లో సమావేశమయ్యారు. బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.   గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారనే  ప్రచారంతో పాటు  రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టుగా సమాచారం.  గత కొంతకాలంగా  పార్టీ మారుతారని  గంటా శ్రీనివాసరావుపై ప్రచారం సాగుతుంది.  పార్టీ మారితే తానే  ఈ విషయాన్ని చెబుతానని  గంటా శ్రీనివాసరావు  మూడు రోజుల క్రితమే ప్రకటించారు. 

ఇటీవలనే కాపునాడు  పోస్టర్ ను  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు  విశాఖపట్టణంలో ఆవిష్కరించారు.  కాపు సామాజికవర్గానికి చెందిన  కార్యక్రమాల్లో గంటా శ్రీనివాసరావు చురుకుగా పాల్గొంటున్నారు.   ఏపీ రాష్ట్రంలో కాపు  సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నేతలు, రిటైర్డ్ అధికారులు ,  వ్యాపారులు  పలు దఫాలుగా సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  ఏపీలో  కాపులు రాజకీయంగా  బలోపేతంపై చర్చించారు. మరోవైపు కాపు సామాజిక వర్గానికి ఓ పార్టీని ఏర్పాటు చేయాలనే  విషయమై కూడా చర్చించారు.ఇదిలా ఉంటే వైసీపీకి  చెందిన కాపు  సామాజిక వర్గానికి చెందిన నేతలు  కూడా  సమావేశాలు నిర్వహిస్తున్నారు.  కాపులకు  జగన్ సర్కార్ చేసిన లబ్ది గురించి  ఆ పార్టీ నేతలు  ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు.

also read:ఏపీ రాజకీయాల్లో కలకలం : కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల మనోహర్ భేటీ... ఏం జరుగుతోంది..?

మరో వైపు  నిన్న సాయంత్రమే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని  జనసేన వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై  ఆయన విమర్శలు చేశారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలను కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు.ఈ వ్యాఖ్యల విషయమై సోము వీర్రాజు  స్పందించలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో  పార్టీ అధిష్టానానికి తెలుసునని ఆయన  ప్రకటించిన విషయం తెలిసిందే.ఇలాంటి సమయంలో  కన్నా లక్ష్మీనారాయణతో  నాదెండ్ల మనోహర్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత  చోటు  చేసుకుంది.  తామిద్దరం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో  తమ  మధ్య మంచి అనుబంధం  ఉందని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
 

click me!