
విజయవాడ: ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి (narayanaswamy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రెడ్డి (reddy community) సామాజికవర్గానికి చెందినవారు ఐక్యంగా వుండాలని సూచించారు. ఒకవేళ రెడ్లలో ఐక్యత లేకుంటే వైసిపి అధికారాన్ని కోల్పోవడం ఖాయమన్నాారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్లలో ఒకరంటే ఒకరికి పడటం లేదని... ఈ విబేధాలతో తిరిగి అధికారాన్ని చంద్రబాబుకు ఇచ్చేట్లున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు.
వైసిపి కీలక నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ఎదుటే మంత్రి నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే మైనారిటీ సామాజికవర్గం వైసిపిపై అసంతృప్తితో వుందని ఇటీవల వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కూమార్ వ్యాఖ్యానించారు. తాజాగా రెడ్లు కూడా అనైక్యతతో పార్టీకి నష్టం చేసేలా వున్నారంటూ మంత్రి నారాయణస్వామి వ్యాఖ్యలు వైసిపిలో ఆందోళనను రేకెత్తించేలా వున్నాయి.
ఇదిలావుంటే నిన్న(సోమవారం) సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ (brother anil kumar) విశాఖపట్నంలో బీసీ (bc), ఎస్సీ (sc), మైనార్టీ (minority) సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన వర్గాలకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు. తమకు తగిన న్యాయం జరగడం లేదంటూ తనతో ఆయా సంఘాల నాయకులు బాధలు చెప్పుకున్నారని... అందువల్లే వారితో చర్చించేందుకే సమావేశమైనట్లు అనిల్ తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు తనను నమ్మి వివిధ సంఘాలు వైసిపి ప్రభుత్వ ఏర్పాటు కృషి చేసారని....ఇప్పుడు వారు బాధలో ఉంటే స్పందించాల్సిన బాధ్యత తనకు వుందన్నారు. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగింది... వాళ్ళు ఒక ప్రత్యామ్నాయా పార్టీ పెట్టాలి... బిసికి సీఎం పదవి ఇవ్వాలని అంటున్నారని... కానీ పార్టీ పెట్టడమంటే సాధారణ విషయం కాదన్నారు. కాబట్టి సీఎం జగన్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానని అనిల్ తెలిపారు.
బ్రదర్ అనిల్ వ్యాఖ్యలను బట్టి చూస్తూ వివిధ కులసంఘాలు వైసిపి పై కోపంతో కొత్తపార్టీని ఏర్నాటుచేయాలని కోరుతున్నాయంటేనే వారు ఆ పార్టీకి దూరమైనట్లే. తాజాగా ఓసిల్లో కీలకమైన రెడ్లు కూడా ఐక్యతగా లేకపోవడం పార్టీకి నష్టం చేస్తుందని మంత్రి నారాయణస్వామి వ్యాఖ్యలతో వైసిపికి కొండంత బలాన్నిచ్చే సామాజిక సమీకరణలు దెబ్బతింటోందని అర్థమవుతోంది. ఇలా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి గడ్డుపరిస్థితిని ఎదుర్కోనుందనేలా మంత్రి నారాయణ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.
గతంలో కూడా మంత్రి నారాయణస్వామి సుప్రీం, హైకోర్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టులకు చెప్పి రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలు తయారు చేయవని ఆయన అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని తాము మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. తామిచ్చిన హామీని నెరవేర్చుకోవడంలో భాగంగా ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలనుకుంటే కోర్టులు స్టే ఇవ్వడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇళ్ల పట్టాల కేసులను కోర్టులు త్వరగా పరిష్కరించాలని నారాయణస్వామి అన్నారు.