విశ్వసనీయత, విలువల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదం:లోకేష్

By Nagaraju TFirst Published Oct 8, 2018, 7:29 PM IST
Highlights

ఐటీ దాడులపేరుతో కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 19 బృందాలు, 200 మంది ఐటీ శాఖ అధికారులు దాడులు చేయడం చూస్తుంటే ఇదంతా కేంద్రం కుట్రగానే భావిస్తున్నట్లు తెలిపారు.  

అమరావతి: ఐటీ దాడులపేరుతో కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 19 బృందాలు, 200 మంది ఐటీ శాఖ అధికారులు దాడులు చేయడం చూస్తుంటే ఇదంతా కేంద్రం కుట్రగానే భావిస్తున్నట్లు తెలిపారు.  

ఐటీ దాడుల పేరుతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు దాడులు నిర్వహిస్తున్నట్లు ఉందని మండిపడ్డారు. వరుసగా ఐటీ దాడులు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. 

ఒకరిద్దరిపైనా ఐటీ దాడులు అంటే సహజమేనని కానీ ఒక్కసారిగా ఇంతమంది ఇన్ని బృందాలు దాడులు చెయ్యడం అంటే కేంద్రం కుట్ర కాదా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కంపెనీలపై దాడులు చేసినా స్పందించాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి ఉందన్నారు లోకేష్. 

మరోవైపు ఐటీ దాడులను ఖండించాల్సిన ప్రతిపక్ష నేత జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఐటీ దాడులు చేస్తే తమకు ఎందుకు భయమని లోకేష్ అన్నారు. రాజకీయాల్లో ఏడు సార్లు ఆస్తులు ప్రకటించిన ఏకైక కుటుంబం మాదేనని లోకేష్ తెలిపారు.  

అవినీతి కేసుల్లో కీలక ముద్దాయిగా ఉంటూ 16 నెలలు జైల్లో ఉన్న జగన్ విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష నేతగా ఏపీపై కేంద్రం చేస్తున్న కుట్రను తిప్పికొట్టాల్సిన జగన్ తమను విమర్శించడం సబబు కాదన్నారు. 
 

click me!