అరెస్ట్ భయంతోనే జనంలోకి.. ఏం చేసినా జైలుకెళ్లడం ఖాయం : చంద్రబాబుపై మంత్రి కారుమూరి విమర్శలు

By Siva KodatiFirst Published May 6, 2023, 4:03 PM IST
Highlights

అమరావతి లాండ్ స్కామ్‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. అమరావతి భూ కుంభకోణం కేసు దర్యాప్తుపై స్టే ఎత్తేయడం, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసుల్లో అరెస్ట్ చేస్తారనే భయంతోనే చంద్రబాబు జనంలో తిరుగుతున్నారని మంత్రి ఆరోపించారు. 
 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పేరుతో దోచుకున్నదంతా బయట పడుతుందనే భయంతోనే విపక్షనేత జనంలో తిరుగుతున్నారని ఆరోపించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చంద్రబాబు రైతుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. 

రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వైసీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కారుమూరి స్పష్టం చేశారు. రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి భూ కుంభకోణం కేసు దర్యాప్తుపై స్టే ఎత్తేయడం, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసుల్లో అరెస్ట్ చేస్తారనే భయంతోనే చంద్రబాబు జనంలో తిరుగుతున్నారని మంత్రి ఆరోపించారు. ఏం చేసినా ఆయనను అరెస్ట్ చేయడం ఖాయమని కారుమూరి నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. 

Latest Videos

Also Read: చంద్రబాబువి దొంగ పర్యటనలు.. రైతుల వేషాల్లో వుంది టీడీపీ నేతలు : మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి

అంతకుముందు గతవారం కారుమూరి మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి త్వరలోనే చంద్రబాబు అవినీతి బట్టబయలు అవుతుందన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం అవినీతిమయమని.. స్టేలు తెచ్చుకోవడమే ఆయన జీవితంగా వుందన్నారు. 1996లో రూ.350 కోట్ల స్కామ్ జరిగినప్పుడు కూడా చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని.. స్వయంగా మోడీ కూడా ఆయన అవినీతిపై ఆరోపణలు చేశారని కారుమూరి గుర్తుచేశారు.

రెండెకరాల నుంచి లక్షల కోట్ల ఆస్తులు చంద్రబాబుకు ఎలా వచ్చాయని నాగేశ్వరరావు ప్రశ్నించారు. అమరావతిలో తాత్కాలిక కట్టడాల పేరుతో రూ.11 వేల కోట్లను ఖర్చు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ చిన్నపాటి వర్షానికే అక్కడ లీకులు అవుతున్నాయని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఎన్నికల సమయంలో ఆయనను విపరీతంగా పొగుడుతూ వుంటారని మంత్రి కారుమూరి ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు తీర్పును బట్టి చంద్రబాబు ఎంతటి అవినీతిపరుడో చెప్పొచ్చన్నారు. 

కాగా.. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అమరావతి భూముల కొనుగోళ్లు, లావాదేవీలకు సంబంధించి జరిగిన అవినీతిపై జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై ఏపీ హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్ట్ బుధవారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. 
 

click me!