
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో నేడు పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలు ముగిసిన 18 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించారు. దీంతో లక్షలాది మంది పదో తరగతి విద్యార్థుల టెన్షన్ కు తెరపడింది. ఈ ఫలితాల్లో ఈ ఏడాది కూడా బాలికలే పై చేయి సాధించారు. ఈ సారి పదో తరగతిలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు తమ విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనికోసం ఇప్పటికే అన్నిఏర్పాట్లు చేస్తున్నట్లు బొత్స ప్రకటించారు. జూన్ రెండవ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
AP 10th Result 2023: పదో తరగతి ఫలితాల విడుదల.. బాలికలదే పైచేయి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
దీనికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల 17లోపు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తులు చేసుకోవాలని, పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. మే 22 వరకు లేట్ ఫీజు రూ.50లతో కలిపి అప్లై చేసుకోవచ్చు అని కూడా తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చినట్లు ఏదైనా అనుమానాలు ఉంటే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకునేవారు మే 13వ తేదీలోగా ఫీజులు చెల్లించాలని బొత్స సత్యనారాయణ సూచించారు.
దీనికి తోడు.. నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు.. ఆయా స్కూల్లో టీచర్లను ప్రోత్సహించే విధంగా ఏదైనా చేయాలనే ప్రణాళికలను ఆలోచిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఫెయిలయిన విద్యార్థులు ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని కోరారు.
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మళ్ళీ పాస్ అయ్యేలా స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దీనికోసం ఇప్పటికే కొన్ని పాఠశాలలను జిల్లాల వారీగా గుర్తించామని తెలిపారు. ఆ స్కూల్స్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా ఉండేలా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని.. దీని ద్వారా విద్యార్థులంతా పై తరగతులకు వెళ్లచ్చని తెలిపారు.