రామోజీ గారు... తడిసి రంగుమారిన ధాన్యాన్ని కొనడమేనా మేం చేసే దోపిడీ..: మంత్రి కారుమూరి ధ్వజం

Arun Kumar P   | Asianet News
Published : May 19, 2022, 03:45 PM ISTUpdated : May 19, 2022, 03:47 PM IST
రామోజీ గారు... తడిసి రంగుమారిన ధాన్యాన్ని కొనడమేనా మేం చేసే దోపిడీ..: మంత్రి కారుమూరి ధ్వజం

సారాంశం

ఎల్లో మీడియా కావాలనే వైసిపి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రులు మండిపడుతున్నారు. నిన్న అంబటి రాంబాబు, నేడు కారుమూరి నాగేశ్వరరావు ఈనాడులో వచ్చిన కధనంపై స్పందిస్తూ మండిపడ్డారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు కధనాలను ప్రచారం చేస్తోందంటూ ఈనాడు దినపత్రికపై మంత్రులు మండిపడుతున్నారు. బుధవారం జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) ఈ పత్రికలో వచ్చిన ‘ఎత్తిపోతున్న ఎత్తిపోతల పథకాలు’వార్తపై స్పందిస్తూ రామెజీరావుపై విరుచుకుపడ్డారు. తాజాగా ధాన్యంలో దోపిడి అంటూ వచ్చిన వార్తపై పౌరసరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు (karumuri nageshwarrao) మండిపడ్డారు. అసలు నిజాలను కప్పిపుచ్చి టిడిపి కరపత్రికలో తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి ఆరోపించారు. 

''నేడు ధాన్యంలో దోపిడి అనే వార్తను టిడిపి కరపత్రిక వడ్డీ వార్చింది. అసలు ధాన్యం దోపిడీ ఎక్కడ... అకాల వర్షాలతో తడిసిపోయి రంగుమారిన ధాన్యాన్ని కూడా మా ముఖ్యమంత్రి కొనండి అనడంలోనా? మా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా చేయడంలోనా? రబీ సీజన్ కు సంబంధించిన ధాన్యం కొనుగోలులో టార్గెట్ పెట్టుకొని మరీ 37 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలి‌ అనుకోవడంలోనా...? ఇప్పటి వరకు పెట్టుకున్న టార్గెట్ లో 40 శాతం అంటే దాదాపుగా 14లక్షల మెట్రిక్ టన్నుల కొనడంలోనా?'' అంటూ మంత్రి ప్రశ్నలవర్షం కురిపించారు. 

''ధాన్యం దోపిడి అని కొంతమంది రైతుల పేర్లు పెట్టి ఆ కరపత్రిక తప్పుడు ప్రచారం చేసింది. నిజాలు చూస్తే... మాన్యం గోపాలకృష్ణ అనే వ్యక్తికి అసలు పొలమే లేదు. అలాంటి వ్యక్తికి  ఐదుకరాలు ఉన్నాయని మిల్లర్లు దోపిడి చేస్తున్నారని రాశారు. ఇక ఉండవల్లి వీరభద్రరావు అనే రైతు సతీమణి పేరు మీదా పొలం ఉంది. వారికి హమాలీ, రవాణా చార్జీలు పడలేదని రాశారు. కానీ వారి అకౌంట్లలో ధాన్యం డబ్బులు జనవరి 3వ తేదీనే జమ అయ్యాయి. అలాగే  హమాలీ చార్జీ 1740 రూపాయలు కూడా 04/05/2022 తేదీన వారి అకౌంట్ లో జమ అయ్యాయి'' అని  మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. 

''కొండపల్లి వెంకట సత్యనారాయణ అనే రైతు కౌలు రైతు...అతను కౌలు కార్డు తీసుకోలేదు. అతనే స్వయంగా మా అధికారులకు ఈ విషయం తెలియచేశాడు. అతనికి కౌలు కార్డు ఇవ్వాలని అధికారులను ఆదేశించాను'' అని మంత్రి తెలిపారు. 

''మేకా రమణమ్మ  అనే మహిళ చెప్పింది ఒక్కటి ఈ కరపత్రికలో రాసింది మరొకటి. రమణమ్మ కుటుంబం కొడుకుని కోల్పోయి పుట్టేడు దు:ఖంలో ఉంటే ఈ కరపత్రికలు వారిని తప్పుడు ప్రచారంలోకి లాగారు. రమణమ్మ కొడుకు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండేవాడు.అతను ఆకస్మికంగా మరణించడంతో తల్లిదండ్రులు కలిసి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని వారు ఆర్బికె సెంటర్ కు గానీ, అక్కడ వాలంటీర్ కు తెలియజేయలేదు. అంతేకాదు విత్తనాలు కూడా ఆర్బికె సెంటర్ ద్వారా కాకుండా వేరే దగ్గర తీసుకొని నష్టపోయామని... ఆ తర్వాత ఆర్బికె సెంటర్ ద్వారా తీసుకున్న విత్తనాలకు మంచి పంట వచ్చిందని కూడా తెలియచేసారు'' అని మంత్రి పేర్కొన్నారు. 

''మేకా వీరసూర్యనారాయణ అనే రైతుకు 12 ఎకరాలకు సంబంధించిన డబ్బులు ఏమి రాలేదని తప్పుడు వార్తను కరపత్రికలో రాశారు. అయితే సూర్యనారాయణ కౌలు రైతు... ఆయన కౌలు కార్డు చేయించుకోలేదు. ఆ రైతువద్దకు మా అధికారులే వెళ్లి కౌలు కార్డు చేయిస్తున్నారు. ఇతడి పంటకు సంబంధించింది హమాలీ చార్జీని 2520 రూపాయలు 16/05/2022 న చెల్లించాం'' అని మంత్రి తెలిపారు. 

''ఇప్పటివరకు తాను చెప్పిన వాస్తవాలను కప్పిపుచ్చి రైతు ప్రభుత్వం మీద రామోజీరావు విషప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. నిన్న వెంకాయమ్మ, నేడు ధాన్యం దోపిడి ఇలా రోజుకో తప్పుడు వార్తలు వడ్డించి ప్రజలను మభ్యపెట్డాలని చూస్తున్నారు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం...మీ ఆటలు ఇక్కడ సాగావు'' అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. 


 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే